తలపాగ చుట్టిన బిర్యాని..!
తలపాగా చుట్టుకొనే అలవాటు ఉన్న నాగా సామి ఈ బిర్యానికి అదే బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయింది. ఆయన సతీమణి చేసిన బిరియాని రుచి మాత్రం తమిళనాడు దాటి వివిధ రాష్ట్రాలు ,దేశాలకు వ్యాపించింది. ఆయన అనంతరం ఈ వ్యాపార బాధ్యతల్ని ఆయన వారసులు తీసుకున్నారు.నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన దీపిక 2008లో ఇంటి కోడలిగా అడుగుపెట్టింది. ఇంటి కోడలిగా తమ వ్యాపారంలో పాలు పంచుకొని కేవలం నాలుగు బ్రాంచ్ లకు మాత్రమే పరిమితమై ఉన్న తలపాకట్టిన బిర్యాని ఐదేళ్ల లోపు 79 బ్రాంచీలు ఏర్పాటు చేసే విధంగా విస్తరించింది.
అతి తక్కువ సమయంలోనే వీరి బిర్యానీ రుచులు ఇంతగా పాకిపోవడానికి గల కారణం నాణ్యమైన బిర్యానీని అందించడమే అనీ దీపిక తెలియజేస్తున్నారు. నాణ్యతలో ఏమాత్రం లోటు లేకుండా కస్టమర్లకు అభిరుచికి తగ్గట్టుగా వారు కోరుకునే రుచిని అందించడంతో ప్రస్తుతం విదేశాలలో కూడా వీరి బ్రాంచీలు ఏర్పడ్డాయని తెలిపారు. అదే విధంగా ప్రతి శాఖలో రాత్రి మిగిలిన అన్నాన్ని అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు ఉచితంగా పంపిస్తామని దీపికా తెలియజేశారు.
సాధారణంగా బిర్యానికి ప్రతి ఒక్కరూ బాస్మతి రైస్ ను ఉపయోగిస్తారు. కానీ తలపాకట్టి బిర్యానికి మాత్రం దిండిగల్ ప్రాంతంలో పండే సీరగ సంబా రకం బియ్యాన్ని వాడతారు. దీనివల్ల మసాలాల రుచి ప్రతి మెతుకులోనూ తెలుస్తుంది. ఇందులో వాడే మాంసం, మసాలా విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.వీరి బిర్యానీలో ఉపయోగించే మసాలా పొడులను ఇప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాలలో ఉన్న మహిళల చేత తయారు చేయిస్తారు.కన్నమ్మాళ్ ఎలాగైతే ఈ బిర్యానీ రుచి ఏవిధంగా ఉండేదో ఇప్పటికీ అదే రుచిని ఇక్కడ అందిస్తున్నారు.
ఈ బిర్యానీలో ఉపయోగించే మసాలా దినుసులను తయారు చేయించడం కోసం మొదటి తరం పని వాళ్ళకు సంబంధించిన కుటుంబ సభ్యులను తీసుకుంటున్నారు. అదేవిధంగా తలపాకట్టికి మూలమైన కన్నమ్మాళ్ పేరు మీద ప్రతి సంవత్సరం మహిళాసాధికారతకు ప్రతిరూపంగా నిలిచేవారిని ఎంపిక చేసి ‘సూపర్ ఉమెన్’ అవార్డునందించి గౌరవిస్తున్నారు. కేవలం ఐదు సంవత్సరాలలోపు ఈ బిరియాని రుచి ఈ విధంగా అభివృద్ధి చెందడానికి గల కారణం కేవలం నాణ్యత మాత్రమే అంటున్నారు దీపిక. స్థాపించిన ఐదు సంవత్సరాలలోపు రెండు వందల కోట్ల రూపాయల వ్యాపారాన్ని అభివృద్ధి చేశారు. ప్రస్తుతం వీటి వ్యాపారం ద్వారా దాదాపు రెండున్నర వేల మందికి ఉపాధి కల్పిస్తున్నామని దీపిక తెలియజేశారు.