ఈ టీతో రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు... ఎలా తయారు చేయాలంటే...?

Reddy P Rajasekhar

దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులు భవిష్యత్తుపై భయాందోళనను పెంచుతున్నాయి. కరోనా చికిత్స కోసం అనేక మందులు అందుబాటులోకి వస్తున్నా అవి పూర్తిస్థాయిలో సత్ఫలితాలు ఇవ్వడం లేదు. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే వైరస్ నియంత్రణ సాధ్యమవుతుంది. ఇప్పట్లో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు లేనందున వైద్యులు రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలని సూచిస్తున్నారు. 
 
రోగ నిరోధక శక్తి ఉన్నవాళ్లు వైరస్ భారీన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఒకవేళ వైరస్ సోకినా త్వరగా కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం కోసం అనేక మార్గాలు ఉన్నాయి. కొన్ని రకాల టీలు కూడా రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. అలా ఇమ్యూనిటీ పవర్ పెంచే వాటిలో దవా చాయ్ ఒకటి. 
 
ఆయుర్వేద వైద్యంలో ఎక్కువగా ఉపయోగించే అశ్వగంధి, శతావరి, నేలవాము, నేల ఉసిరి, తిప్పతీగ, పచ్చి పసుపు, శొంఠి, మిరియాలు, లవంగాలు, యాలకలు లాంటి 24 వనమూలికలతో దవా చాయ్ ను తయారు చేస్తారు. ఎన్నో ఔషధ గుణాలు ఉన్న ఈ చాయ్ ను ప్రతిరోజూ తాగడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఆయుర్వేద వైద్య నిపుణుడు డాక్టర్ గుమ్మడవెల్లి శ్రీనివాస్ రోజూ రెండు కప్పులు దవా చాయ్ ను తాగితే మంచిదని చెబుతున్నారు. 
 
రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఎ, ఇ, డి, సి, బి విటమిన్లు, జింక్, సెలీనియం, ఐరన్, కాపర్ తదితర ఖనిజాలు, ఫైటోన్యూట్రియెంట్స్, అమైనో ఆమ్లాలు, ఫ్యాటీ ఆమ్లాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. విటమిన్ ఎ శ్వాసకోశ సంబంధిత వ్యాధుల నివారణకు దోహదపడగా ఇ, బీటా కెరోటిన్, సి, బి విటమిన్లు, జింక్, సెలీనియంలు యాంటీ ఆక్సిడెంట్లుగా పని చేస్తాయి. నిపుణులు అన్ని పోషకాలు సరైన మోతాదులో ఉండే సమతుల ఆహారం తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: