సిగరెట్లు మానడం ఎలా అంటే...?
పొగ తాగడం శరీరంపై తీవ్రమైన చెడు ప్రభావం చూపుతుంది. పొగ తాగే అలవాటుకు బానిసలైనవారు చాలా మంది ఈ అలవాటును మానేయాలని అనుకుంటారు. కానీ ఆ అలవాటును మానటం సాధ్యం కావడం లేదని చెబుతుంటారు. కొందరు సిగరెట్ కావాలని అలవాటు చేసుకోకపోయినా సరదాగా కాల్చడం వలనో, స్నేహితుల ముందు గొప్పలు పోవడానికో అలవాటు చేసుకుంటారు.
సిగరెట్లు ఎక్కువగా తాగే వారికి ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండెజబ్బులు వచ్చే అవకాశం ఉంది. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సిగరెట్ తాగే అలవాటును దూరం చేసుకోవచ్చు. ప్రతిరోజూ తాగే సిగరెట్ల సంఖ్యను క్రమంగా తగ్గించుకోవాలి. నికోటిన్ ప్రత్యామ్నాయంగా ఉండే ఉత్పత్తులను తీసుకొని క్రమంగా పొగ తాగడం మానేయవచ్చు. ఏ సమయంలో సిగరెట్ తాగుతున్నారో చెక్ చేసుకొని ఆ సమయంలో వేరే పనిపై మనసు మళ్లించటం మంచిది.
సిగరెట్ తాగకూడదు అని తీసుకున్న నిర్ణయాన్ని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు చెప్పాలి. అలా చెబితే సిగరెట్ తాగాలనిపించినా వారికి భయపడి సిగరెట్ కు దూరమయ్యే అవకాశం ఉంది. సిగరెట్లు తాగడం వలన కలిగే లాభాలేంటో, నష్టాలేంటో మీ మనసుతో మీరే చర్చించాలి. పొగ తాగాలనే కోరిక పెరిగితే ఎండు ఫలాలు, చిప్స్, పచ్చళ్లు తినాలి. వీటికి పొగ తాగాలనే కోరికను తగ్గించే గుణం ఉంటుంది.
సిగరెట్ తాగుతున్నారంటే మిమ్మల్ని మీరే కొద్దికొద్దిగా చంపుకుంటున్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. సిగరెట్ మానేయాలన్న ఆలోచన బలపడితే అడుగులు సిగరెట్ వైపు పడకుండా నిగ్రహించుకుంటే కొన్ని రోజులు కష్టంగా అనిపించినా ఆ తరువాత సిగరెట్ గుర్తుకు రాదు.