జాబ్ కొట్టేద్దాం: చదవడమే కాదు.. ఇది చాలా ముఖ్యం?
వీలైనంత వరకూ అభ్యర్థులు అన్ని పరీక్షలు రాసే వెసులుబాటు కల్పించాలని సీఎం కేసీఆర్ సదరు కమిటీకి ఆదేశాలిచ్చారు. దీంతో ఇప్పుడు నిరుద్యోగులు ప్రిపరేషన్ ప్రారంభించారు. అయితే.. ఇక్కడ ఉద్యోగం కొట్టేద్దాం అనుకున్న వారు గుర్తుంచుకోవాల్సింది క్రమశిక్షణ.. ఉద్యోగం సంపాదించాలనే కోరిక ఎంతగా ఉందో.. అందుకు అంతగా కష్టపడటానికి కూడా సిద్ధమైనప్పుడే ఉద్యోగ వేటలో విజయం సాధిస్తారు. పరీక్షల కోసం సిద్ధమవటం అంటే.. వరసగా పుస్తకాలు చదివేస్తూపోవటం కానే కాదు.. చదవిని దాన్ని సమయానుకూలంగా రివిజన్ కూడా చేసుకోవాలి. పరీక్షలకు ఉన్న సమయం ఎంత.. మనం ఎంత సయమం వెచ్చించగలం.. అన్న విషయాన్ని ఎవరికి వారు బేరీజు వేసుకుని.. అందుకు అనుగుణంగా టైమ్ టేబుల్ వేసుకుని ముందుకు సాగాలి.
చాలా మంది గుడ్డెద్దు చేలో పడినట్టు చదువుకుంటూ వెళ్లిపోతారు. సిలబస్ కంప్లీట్ చేయడమే లక్ష్యంగా దూసుకు వెళ్తారు. కానీ..ఆ విద్యార్థుల్లో చాలా మంది రివిజన్ మాత్రం చేయరు.. అదో టైమ్ వేస్ట్ వ్యవహారంగా అనుకుంటారు. బాగానే చదివేశాను.. ఒకసారి చదివినవే కదా. వచ్చినవే కదా. మళ్లీ చదవడం ఎందుకు.. దీని కంటే కొత్తవి చదువుకుందా అనే దృష్టితో ఉంటారు. అది సరికాదు.
మనం ఎంత ఇష్టంగా చదివినా.. 1 గంట తర్వాత 56 శాతం మరిచిపోతామని నిపుణులు చెబుతున్నారు. అదే ఒక రోజు తర్వాత 66 శాతం మర్చిపోతామట. 6 రోజుల తర్వాత 75 శాతం .. మర్చిపోతామట. అందుకే.. వీలైనన్ని సార్లు రివిజన్ చేసుకుంటే.. చదివింది బాగా గుర్తుండిపోతుంది. లేకుంటే చదివిందే అయినా మళ్లీ కొత్తగా ఉంటుంది.