గుడ్‌ న్యూస్‌: తెలంగాణలో భారీగా పోస్టులు..!

తెలంగాణ నిరుద్యోగులకు ఇది చాలా మంచి శుభవార్త.. తెలంగాణలో మళ్లీ భారీగా పోస్టులు రాబోతున్నాయి. తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా నడిపిస్తున్న గురుకులాల్లో భారీగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ మేరకు గురుకుల సొసైటీలు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాయి. వీటిని ప్రభుత్వం ఆమోదించి అనుమతులు ఇస్తే.. వెంటనే భర్తీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.

వివరాల్లోకి వెళ్తే.. సంక్షేమ గురుకుల సొసైటీల్లో రాష్ట్రపతి ఉత్తర్వులు అమలు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. దీనివల్ల ఇప్పుడు గురుకుల సొసైటీల్లో పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ అయ్యింది. ఈ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో 10 వేల వరకూ పోస్టులు భర్తీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త జోనల్‌ విధానం అమలుపై ఇంకా ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదు.

అయినప్పటికీ నూతన జోనల్‌ విధానం మేరకు ఖాళీలను గురుకుల సొసైటీలు గుర్తించాయి.  కొత్తగా గుర్తించిన పోస్టులతో పాటు గతంలో మంజూరైన పోస్టులనూ కలిపి.. భర్తీకి అనుమతుల కోసం ప్రభుత్వానికి ఈ గురుకుల సొసైటీలు ప్రపోజల్స్ పంపించాయి. గురుకుల సొసైటీలు పంపిన పోస్టులన్నీ మంజూరు చేసి భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇస్తే.. తెలంగాణలో పోలీస్‌శాఖ తరువాత అత్యధిక పోస్టులు గురుకులాల్లోనే ఉండే అవకాశం ఉంది.

తెలంగాణలో మొత్తం వెయ్యి వరకూ గురుకుల పాఠశాలలు పనిచేస్తున్నాయి. ఇవి అనేక సొసైటీల కింద పని చేస్తున్నాయి. మైనార్టీ, బీసీ సొసైటీల పరిధిలోనే 500 వరకూ పాఠశాలలు ఉన్నాయి. బీసీ గురుకుల సొసైటీ పరిధిలోనే అనేక కేటగిరీల్లో 5 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్టు గుర్తించారు. మైనార్టీ సంక్షేమ శాఖ పరిధిలో 1,250 వరకూ లెక్చరర్‌ పోస్టులు కొత్తగా రాబోతున్నాయి. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సొసైటీల్లో భర్తీ చేయకుండా మిగిలిన భాషా పండితులు, పీఈటీలు వంటివి మరో 1,200 పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు పరిపాలన సంబంధ పోస్టులు కూడా భారీగానే ఖాళీగా ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో గుర్తించిన బోధన సిబ్బంది పోస్టులు, ఇతర పోస్టులు అన్నీ కలిపితే మొత్తం 10 వేలకు పైగా పోస్టులు ఉన్నట్లు లెక్క తేలుతున్నాయి. వీటన్నిటికీ ప్రభుత్వం ఓకే చెబుతుందా.. కోత పెడుతుందా అన్నది తేలాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: