టాలీవుడ్ పరిస్థితిపై దిల్ రాజు ఓపెన్ టాక్...!

Amruth kumar
టాలీవుడ్ అగ్ర నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు అంటే ఇండస్ట్రీలో ఒక బ్రాండ్. ఆయన ఏది మాట్లాడినా అందులో ఒక క్లారిటీ, బిజినెస్ లాజిక్ ఉంటుంది. అయితే తాజాగా ఒక వేదికపై దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫిల్మ్ నగర్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎప్పుడూ కాన్ఫిడెంట్‌గా ఉండే రాజు గారు, ఈసారి మాత్రం "బరువెక్కిన హృదయంతో.. చేదు నిజాలను" బయటపెట్టారు.టాలీవుడ్‌లో ఒకప్పుడు నిర్మాత అంటే 'రాజసం'. సినిమా సెట్స్‌పైకి వస్తే నిర్మాత మాటే శాసనం. కానీ ఇప్పుడు కాలం మారింది.. ఆ కాలంతో పాటు నిర్మాతల గౌరవం కూడా తగ్గిపోతోందని దిల్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఒక ప్రైవేట్ వేడుకలో పాల్గొన్న ఆయన, ప్రస్తుత సినిమా ఇండస్ట్రీ పరిస్థితిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.



దిల్ రాజు మాట్లాడుతూ.. "ఒకప్పుడు నిర్మాత అంటే అందరినీ పోషించే దేవుడు. కానీ ఇప్పుడు పరిస్థితి తలకిందులైంది. డబ్బులు పెట్టిన నిర్మాత కంటే, ఆ డబ్బు తీసుకునే వారే (హీరోలు, దర్శకులు) నిర్మాతను శాసించే స్థాయికి వచ్చేశారు. నిర్మాత కేవలం చెక్కులు ఇచ్చే వ్యక్తిగానే మిగిలిపోతున్నాడు" అని వాపోయారు. పాన్ ఇండియా ట్రెండ్ వచ్చాక నిర్మాతలు నలిగిపోతున్నారని, వందల కోట్లు ఖర్చు చేస్తున్నా నిర్మాతలకు సరైన గుర్తింపు గానీ, గౌరవం గానీ దక్కడం లేదని ఆయన బరువెక్కిన హృదయంతో చెప్పారు.



తన కెరీర్ తొలినాళ్లలో 'దిల్' సినిమాను హిందీలో రీమేక్ చేయాలని సీనియర్ నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు అడిగినప్పుడు, ఆయనపై ఉన్న గౌరవంతో హక్కులు ఉచితంగా ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డానని రాజు గారు గుర్తు చేసుకున్నారు. అప్పట్లో నిర్మాతలకు ఉన్న విలువ అలాంటిదని, ఇప్పుడు అలాంటి బంధాలు, గౌరవాలు కనుమరుగైపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.కేవలం గౌరవం మాత్రమే కాదు, ఆర్థికంగా కూడా నిర్మాతలు భారీ రిస్క్‌లో ఉన్నారని దిల్ రాజు హెచ్చరించారు. సినిమాలను త్వరగా ఓటీటీకి ఇవ్వడం వల్ల ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గించేశారని, ఇది తాము చేసిన పెద్ద పొరపాటని ఆయన ఒప్పుకున్నారు. భారీ రెమ్యూనరేషన్లు, పెరిగిన నిర్మాణ వ్యయం వల్ల సినిమా హిట్ అయినా నిర్మాత జేబులోకి డబ్బులు రావడం కష్టంగా మారిందని పేర్కొన్నారు.ప్రభుత్వం నుంచి సపోర్ట్ ఉన్నా, బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకోవడం ఇప్పుడు కత్తి మీద సాములా మారిందని విశ్లేషించారు.



రామ్ చరణ్ తో తీసిన 'గేమ్ ఛేంజర్' ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడం, భారీ నష్టాలను మిగిల్చడం కూడా రాజు గారి ఈ ఎమోషనల్ స్పీచ్ కు ఒక కారణం కావచ్చని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఎంత పెద్ద నిర్మాత అయినా ఒకే ఒక్క ఫెయిల్యూర్ తో అతలాకుతలం అయిపోయే పరిస్థితి ఇప్పుడు ఇండస్ట్రీలో ఉందన్నది కాదనలేని సత్యం.
దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీశాయి. కేవలం డబ్బులే కాకుండా, క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా తన ముద్ర వేయాలనుకునే రాజు గారి లాంటి వారే ఇలా అన్నారంటే, చిన్న నిర్మాతల పరిస్థితి మరెంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: