పలాస దాహార్తి తీర్చిన ఎమ్మెల్యే శిరీష... జల సంకల్పానికి గ్రీన్‌సిగ్నల్...!
పట్టువదలని పోరాట పటిమ :
ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుండి ఎమ్మెల్యే శిరీష నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కారాన్నే మెయిన్ టార్గెట్‌గా పెట్టుకుని పనిచేశారు. జంట నగరాల ప్రజలు పడుతున్న ఆవేదనను, బిందెలతో నీటి కోసం పడుతున్న కష్టాలను తన కళ్లారా చూసి చలించిపోయారు. ఈ సమస్య తీవ్రతను ప్రభుత్వానికి తెలియజేయాలనే దృఢ సంకల్పంతో, ఆమె పలుమార్లు రాజధాని అమరావతికి వెళ్లి మున్సిపల్ శాఖా మంత్రి, ఉన్నతాధికారులకు విన్నవించారు. ఇక్కడ సమస్య గురించి విజ్ఞప్తి చేయడమే కాకుండా, ప్రాజెక్టు ఆవశ్యకతను, సాంకేతిక వివరాలను సమర్పిస్తూ, నిధులు మంజూరయ్యే వరకు పట్టువదలని విక్రమార్కురాలిలా పోరాడారు.
ప్రభుత్వ ఉత్తర్వులు మరియు నిధుల కేటాయింపు :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ, 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను G.O.RT.No. 467 ద్వారా రాష్ట్రవ్యాప్తంగా నీటి సరఫరా ప్రాజెక్టులకు అనుమతి మంజూరు చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం మొత్తం రూ. 1702.68 కోట్ల ప్రాజెక్టులలో భాగంగా, పలాస మున్సిపాలిటీకి ప్రత్యేకంగా రూ. 121.99 కోట్లు కేటాయించడం జరిగింది. APUFIDC ద్వారా సమగ్ర ప్రాజెక్టు నివేదికలను (DPRs) జాతీయ గృహ నిర్మాణ బ్యాంకు (NHB) మార్గదర్శకాలకు అనుగుణంగా రూపొందించి సమర్పించడంతో ఈ నిధులు ఖరారయ్యాయి. వంద కోట్లకు పైగా నిధులు సాధించిన అతికొద్ది మున్సిపాలిటీలలో పలాస ఒకటిగా నిలవడం విశేషం.
శిరీష నాయకత్వ పటిమకు నిదర్శనం :
ఈ శుభవార్త తెలియగానే పలాస - కాశీబుగ్గలో పార్టీలకు అతీతంగా పలువురు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులు, ప్రజలు, మరియు అభిమానులు గాంధీ విగ్రహం అక్కడ నుండి పలాస మూడు రోడ్ల కూడలి వద్దకు భారీగా చేరుకొని బాణాసంచా కాలుస్తూ, స్వీట్లు పంచుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. "మున్సిపాలిటీ రాజకీయ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో నిధులు మంజూరు కావడం ఇదే ప్రథమం అని, ఇదంతా ఎమ్మెల్యే శిరీష పోరాటంతోనే వచ్చిందని ఆమెను ప్రశంసిస్తున్నారు. ఈ నిధులతో ఇకపై జంట నగరాల్లోని ప్రతీ ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందనుంది. భవిష్యత్తులో నీటి ఎద్దడి తలెత్తకుండా శాశ్వత చర్యలు చేపట్టనున్నారు.