ప్రైవేటు పాఠశాలల్లో ఎంత కట్టాలో తెలుసా..?

చదువు పేరుతో నిలువు దోపిడీ చేస్తున్న ప్రైవేటు విద్యా సంస్థలకు చెక్ పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ నడుం బిగించింది. కేజీ నుంచి పీజీ వరకు ఇప్పటికే వేలకు వేలు వసూలు చేస్తున్న ప్రైవేటు విద్యా సంస్థల తీరును పలువురు తల్లిదండ్రులు తప్పుబడుతున్నారు. కొన్ని కార్పోరేట్ విద్యా సంస్థలైతే... ప్రీ హైస్కూల్ కే లక్ష రూపాయల వరకు వసూలు చేస్తున్నాయి. ఇక హైస్కూల్ నుంచే ఐఐటీ, ఒలంపియాడ్... అంటూ రకరకాల పేర్లతో లక్షలకు లక్షలు జేబుల్లో వేసుకుంటున్నారు. అదేమంటే... మా దగ్గర దొరికే క్వాలిటీ ఎడ్యుకేషన్ మరెక్కడా ఉండదంటున్నారు. చివరికి మీ పిల్లాడికి తప్పకుండా ర్యాంక్ వస్తుందని కూడా భరోసా ఇస్తున్నారు. మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆ మాత్రం ఖర్చు చేయలేరా అంటూ తల్లిదండ్రులను సెంటిమెంట్ గా దెబ్బ తీస్తున్నారు. చాలా మంది పేరెంట్స్... పిల్లల భవిష్యత్తు కోసం అప్పులు చేసి మరీ కార్పోరేట్ విద్యా సంస్థలకు ఫీజులు చెల్లిస్తున్నారు.
తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి, ప్రైవేటు విద్యా సంస్థల నిలువు దోపిడీపై దృష్టి పెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం... విద్యాసంస్థల్లో చెల్లించే ఫీజులపై నియంత్రణ విధించింది. ప్రతి విద్యా సంస్థ ఎంత వసూలు చేయాలో స్పష్టమైన జాబితా రూపొందించింది. గ్రామ పంచాయతీ పరిధి నుంచి కార్పోరేషన్ స్థాయి వరకు ఆయా ప్రాంతాన్ని బట్టి ఫీజులను నిర్ణయించింది జగన్ సర్కార్. గ్రామ పంచాయతీ పరిధిలోని సూళ్లల్లో ప్రైమరీ విద్యకు 10 వేల రూపాయలు, హైస్కూల్ విద్యాభ్యాసానికి 12 వేల రూపాయలు వసూలు చేయాల్సి ఉంటుంది. ఇక మునిసిపాలిటీ పరిధిలోని పాఠశాలల్లో దీనిని కాస్త పెంచారు. ప్రైమరీ విద్యకు 11 వేల రూపాయలు, హైస్కూల్ విద్యకు మాత్రం 15 వేల రూపాయలు తీసుకోవాలి. ఇక కార్పోరేషన్ పరిధిలో మాత్రం కాస్త వెసులుబాటు కల్పించింది. ప్రైమరీ విద్య కోసం 12 వేల రూపాయలు, హైస్కూల్ విద్యకు మాత్రం 18 వేల రూపాయలు వరకు వసూలు చేయవచ్చు.
అటు కళాశాలల్లో వసూలు చేసే ఫీజులపై కూడా రాష్ట్ర ప్రభుత్వం నియంత్రణ విధించింది. మూడు విభాగాలుగా ఈ పరిధిని ప్రభుత్వం విభజించింది. గ్రామ పంచాయతీల పరిధిలోని కాలేజీల్లో ఎంపీసీ, బైపీసీ కోర్సులకు 15 వేల  రూపాయలు, ఇతర గ్రూపులకు మాత్రం 12 వేల రూపాయలుగా నిర్ణయించింది. ఇక మునిసిపాలిటీ పరిధిలోని కాలేజీల్లో ఎంపీసీ, బైపీసీ కోర్సులకు 17 వేల 500 రూపాయలు, ఇతర గ్రూపులకు 15 వేల రూపాయలు ఖరారు చేసింది  ఇక కార్పోరేషన్ పరిధిలోని కళాశాలల్లో మాత్రం ఎంపీసీ, బైపీసీ కోర్సులకు 20 వేల రూపాయలు, ఇతర గ్రూపులకు 18 వేల రూపాయల వరకు వసూలు చేసుకునే అవకాశం కల్పించింది. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ సర్కార్ హెచ్చరికలు జారీ చేసింది. ప్రతి విద్యార్థికి కూడా తప్పనిసరిగా రశీదు చెల్లించాలని సూచించింది. అలాగే ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే... వెంటనే సంబంధిత ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేయాలని కూడా వెల్లడించారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: