బీజేపీ ఇక బాబుకే జై.. బాబు వెంటే... !
అనుమానాల నుంచి క్లారిటీ వరకు..
ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రకటించిన 'సూపర్ సిక్స్' హామీల విషయంలో బీజేపీ మౌనంగా ఉండటం, కూటమి అజెండా కంటే సొంత పార్టీ బలోపేతంపైనే దృష్టి పెట్టడం వంటివి చూసి.. భవిష్యత్తులో బీజేపీ మళ్ళీ వైసీపీ వైపు చూస్తుందేమో అన్న చర్చ నడిచింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ 15 ఏళ్ల సుదీర్ఘ బంధం గురించి మాట్లాడుతున్నా, బీజేపీ నేతలు పెద్దగా స్పందించకపోవడం ఈ అనుమానాలకు బలం చేకూర్చింది. కానీ, తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న వ్యూహాలు బీజేపీని కట్టిపడేస్తున్నాయి.
బాబు మార్క్ 'బంధం'.. బీజేపీ ఫిదా..
బీజేపీని తనతోనే ఉంచుకోవడంలో చంద్రబాబు అత్యంత చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. అందుకు ప్రధాన కారణాలు చాలా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాజధాని అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం కంటే ముందే వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరించి బీజేపీ అగ్రనాయకత్వం మనసు గెలుచుకున్నారు. వాజ్‌పేయి గౌరవార్థం అమరావతిలో ప్రత్యేకంగా స్మృతి వనం ఏర్పాటు చేయాలని నిర్ణయించడమే కాకుండా, దానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించడం బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది.
ఇటీవల జరిగిన 'వాజ్‌పేయి-మోడీ సుపరిపాలన యాత్ర'కు టీడీపీ యంత్రాంగం పూర్తిస్థాయిలో సహకరించింది. టీడీపీ నాయకులు కూడా ఈ యాత్రలో పాల్గొనేలా చంద్రబాబు ప్రోత్సహించడం విశేషం. ప్రతి వేదికపై ప్రధాని నరేంద్ర మోడీ పాలనను, ఆయన సాధించిన విజయాలను చంద్రబాబు కొనియాడుతున్నారు. తద్వారా కేంద్రంతో ఎలాంటి ఇబ్బందికి తావు లేకుండా రాష్ట్రానికి రావాల్సిన నిధులను, ప్రాజెక్టులను సాధించుకుంటున్నారు.
రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాకపోయినా, ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీకి చంద్రబాబు కంటే నమ్మకమైన మిత్రుడు మరెవరూ లేరనే భావన కలుగుతోంది. బీజేపీ అజెండాను గౌరవిస్తూనే, తన పాలనను సాగిస్తున్న బాబు వ్యూహం ఫలిస్తోంది. అందుకే, రాజకీయ విశ్లేషకులు ఇప్పుడు బీజేపీ ఇప్పుడు బాబు వెంటే... బాబుకే జై కొడుతుందన్న విశ్లేషణలు వ్యక్తం చేస్తున్నారు.