జ‌గ‌న్ బ‌ర్త్ డే: అర్థం కాని అధినేత‌.. !

RAMAKRISHNA S.S.
డిసెంబ‌రు 21.. వైసీపీ అధినేత జ‌గ‌న్ 53వ పుట్టిన రోజు. అయితే.. ఆయ‌న పుట్టిన రోజుకు గ‌తంలో ఉన్న ప్రాధాన్యం ఇప్పుడు క‌నిపించ‌డం లేదు. గ‌తంలో కుటుంబ స‌భ్యుల నుంచి మంచి ఆద‌ర‌ణ ఉండేది. వారంతా ఒక‌రోజు ముందుగానే వేడుక‌లు ప్రారంభించి.. రాత్రంతా ప్రార్థ‌న‌లు చేసేవారు. ఇక‌, పుట్టిన రోజు నాడు ఉత్సాహం.. వేరేగా ఉండేది. అయితే.. అధికారంలో ఉండ‌గా.. ఎప్పుడైతే.. కుటుంబాన్ని దూరం పెట్టారో.. అప్ప‌టి నుంచి జ‌గ‌న్ అర్థం కాని అధినేత‌గా మారిపోయారు.


ఒక్క వైసీపీలోనే కాదు.. రాజ‌కీయ వ‌ర్గాల‌కు కూడా అర్ధంకాని పార్టీ నాయ‌కుడిగా మారార‌న్న చ‌ర్చ ఉంది. ఒక పుట్టిన రోజు వ‌స్తే.. భ‌విష్య‌త్తుకు అతి ప్ర‌తిబింబంగా మారుతుంది. కానీ.. జ‌గ‌న్ పుట్టిన రోజులు అలా క‌నిపించ‌డం లేదు. ఇటు పార్టీ నాయ‌కుల్లోనూ కొని తెచ్చుక‌న్న ఉత్సాహ‌మే త‌ప్ప‌.. మాన‌సికంగా వారు పొందుతున్న ఆనందం అంటూ పెద్ద‌గా క‌నిపించ‌డంలేదు. ఒక‌ప్పుడు తాడేప‌ల్లికి క్యూక‌ట్టిన నాయ‌కులు ఇప్పుడు మౌనంగా ఉంటున్నారు. ముక్త‌స‌రి విషెస్‌తో స‌రిపుచ్చుతున్నారు.


ఏంటి కార‌ణం..?
పార్టీ అధినేత‌గా జ‌గ‌న్ తీసుకుంటున్న నిర్ణ‌యాలు.. నేత‌ల‌కు న‌చ్చ‌డం లేదు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు తీసుకున్న `మార్పుల‌` నిర్ణ‌యం కార‌ణంగా.. తామంతా మునిగిపోయామ‌న్న వాద‌న‌లో నాయ‌కులు ఉన్నారు. ఇప్ప‌టికైనా త‌మ మాట‌కు.. త‌మ‌కు విలువ ఇవ్వాల‌ని కోరుతున్న వారు క‌నిపిస్తున్నారు. గ‌త  పుట్టిన రోజు స‌మ‌యానికి పార్టీలో ఉన్న కీల‌క నాయ‌కుల్లో అనేక మంది జంప్ అయ్యారు. వ‌చ్చే  పుట్టిన రోజు నాటికి ఎంత మంది ఉంటారో చెప్ప‌లేని ప‌రిస్థితి నెల‌కొంది.


ఇప్పుడు కూడా..జ‌గ‌న్‌లో మార్పు క‌నిపిస్తున్న దాఖ‌లా లేదు. వ‌చ్చే 2029 ఎన్నికల ప‌రిస్థితిని ముందుగానే స్వ‌ప్నిస్తున్నారో.. లేక ఏమో తెలియ‌దు కానీ.. ఇప్ప‌టి నుంచి మ‌రోసారి మార్పుల దిశ‌గా అడుగులు వేస్తున్నారు. ఈ ప‌రిణామాల‌ను ప్ర‌స్తుత నేత‌లు త‌ప్పుబ‌డుతున్నారు. ``జ‌గ‌న్ తీరు అర్ధం కావ‌డంలేదు`` అనే టాక్ జోరుగా వినిపించ‌డానికి కార‌ణం ఇదే. అందుకే.. ఆయ‌న అర్థం లేని.. కాని.. అధినేత‌గా మిగిలిపోతున్నార‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: