ట్రంప్ ఎఫెక్ట్..! భారత్ ని బాగానే దెబ్బేశారు గా..?
డొనాల్డ్ ట్రంప్.. ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తున్న పేరు. తన నిర్ణయాలతో ఇతర దేశాల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నారు. అమెరికా ఫస్ట్ అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన ట్రంప్ ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. గతం కంటే భిన్నంగా వ్యవహరిస్తూ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఆయన నిర్ణయాలకు ఎవరైనా అడ్డు చెబితే అంతకు మించి అన్నట్లు చుక్కలు చూపిస్తున్నారు.
ట్రంప్ ప్రభావం భారత్ కాస్తంతా ఎక్కువగానే పడుతోంది. బాధ్యతలు స్వీకరించిన రోజే భారత్ కు పౌరసత్వం విషయంలో బిగ్ షాక్ ఇచ్చారు. తర్వాత సుంకాల విషయంలో ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన రోజు వ్యాఖ్యల ఫలితంగా దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. ఫలితంగా... రూ.7 లక్షల కోట్ల మేర సంపద ఆవిరైంది. మెక్సికో, కెనడాలపై 25 శాతం సుంకాలు విధిస్తామని ట్రంప్ తాజాగా ప్రకటించడం.. అప్పటికే భారత్ సహా పలు దేశాలపైనా సుంకాల విధింపు తప్పదని చేసిన వ్యాఖ్యలు వెరసి మార్కెట్ సెంటిమెంట్ ను దెబ్బతీశాయి.
వైట్ హౌస్ లో అడుగు పెట్టిన రోజు భారత్ స్టాక్ ఎక్స్చేంజ్ లో రూ.7 లక్షల కోట్లు ఆవిరైపోయినట్లు చెబుతోన్న నేపథ్యంలో.. తాజాగా కొలంబియాపై చూపించిన కోపం ఎఫెక్ట్ దేశీయ స్టాక్ మార్కెట్ పై పడటం గమనార్హం. ఈ సమయంలో.. భారత మార్కెట్ సుమారు రూ.10 లక్షల కోట్లు ఆవిరైనట్లు చెబుతున్నారు. అలాగే.. డాలర్ తో రూపాయి మారకం విలువ 11 పైసలు బలహీనపడి.. 86.33 వద్ద ముగిసింది.
ఇన్వెస్టర్స్ సంపదగా భావించే బీ.ఎస్.ఈ.లో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.10 లక్షల కోట్ల మేర ఆవిరై.. రూ.410 లక్షల కోట్లకు చేరింది. దీనికి కారణం ట్రంప్ కు కోపం తెప్పిస్తూ కొలంబియా నిర్ణయం తీసుకోవడమే. అక్రమ వలసదారులకు సంకెళ్లు వేసి, నేరస్తులుగా ట్రీట్ చేస్తూ పంపుతున్నారంటూ కొలంబియా వ్యాఖ్యానించింది.. అమెరికా విమానాలను వెనక్కి పంపించింది. దీంతో... ట్రంప్ సీరియస్ అయ్యారు, ఆ దేశంపై సుంకాలు 25శాతం విధిస్తామని బెదిరించారు. తన నిర్ణయాలను వ్యతిరేకించే దేశాలను దారిలోకి తెచ్చుకోవడం కోసం ట్రంప్ ఈ విధంగా బెదిరింపులకు దిగుతుండటంతో ఎప్పుడు, ఏ దేశంపై ట్రంప్ ఉరుముతారో అనే భయాందోళనలు నెలకొన్నాయని.. వాటి ప్రభావం దేశీయ స్టాక్ ఎక్స్చేంజ్ పై బలంగా పడుతుందని అంటున్నారు.