![నారా లోకేష్ పొలిటికల్ కెరీర్ అతి పెద్ద టర్నింగ్ పాయింట్ ఇదే..!](https://www.indiaherald.com/cdn-cgi/image/width=350/imagestore/images/editorial/77/-nara-lokesh275cbfe3-c7a9-4688-b01e-c80372dc16a7-415x250.jpg)
నారా లోకేష్ పొలిటికల్ కెరీర్ అతి పెద్ద టర్నింగ్ పాయింట్ ఇదే..!
అనేక తర్జన-భర్జనలు.. !
అది 2021, ఆగస్టు. అప్పటికి టీడీపీ అధికారం కోల్పోయి రెండేళ్లు అయిపోయింది. అయితే..కరోనా కారణం గా.. ఆ రెండేళ్ల పాటు పార్టీ తరఫున పెద్దగా ఎలాంటి కార్యక్రమాలు చేయలేదు. ఇక, అప్పటి వరకు పేరు మార్మోగిన నారా లోకేష్.. హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. దీంతో ఆయన పేరు కూడా పెద్దగా వినిపించ లేదు. కేవలం చంద్రబాబు మాత్రమే జూమ్ మీటింగ్ ద్వారా వైద్యులతో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలకు సూచనలు సలహాలు ఇవ్వడం ప్రారంభించారు. అనంతర కాలంలో ప్రజలకు ఎలా చేరువ కావాలన్న చర్చవచ్చింది.
పైగా.. పార్టీలో నెంబర్ 2 ఎవరు అన్న ప్రశ్న కూడా తెరమీదికి వచ్చింది. ఒకవైపు జూనియర్ ఎన్టీఆర్ పేరు తెరమీదికి రావడం.. దీనిపై పెద్ద ఎత్తున స్థానికంగా వివాదాలు రేగిన నేపథ్యంలో నారా లోకేష్ పాదయాత్ర కు శ్రీకారం చుట్టారు. వాస్తవానికి రెండు లక్ష్యాలతో ఆయన యాత్ర చేశారు. 1) పార్టీని అధికారంలోకి తీసుకురావడం. 2) పార్టీలో నెంబర్ 2 అన్న వివాదానికి తనదైన శైలిలో ఫుల్ స్టాప్ పెట్టడం. అయితే.. ఈ యాత్రకు ముందు.. అనేక తర్జన భర్జనలు పడ్డారు. ఆరోగ్యం గురించిన ఆందోళన ఎక్కువగానే కనిపించింది.
అయినప్పటికీ జవనరి 27, 2023న నారా లోకేష్ తన పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. తొలిరోజే విషాదం చోటు చేసుకుని విరామం ఇచ్చినా.. తర్వాత పుంజుకుంది. అయితే.. ఈ పాదయాత్ర సజావుగా సాగలేద న్నది వాస్తవం. వైసీపీ తీసుకువచ్చిన జీవో -నెంబర్ 1తో అనుమతులు ఇవ్వలేమని పోలీసులు చెప్పడం.. తర్వాత కాలంలో చంద్రబాబు అరెస్టు, కార్యకర్తల గృహ నిర్బంధాలు.. ఇలా అనేకానేక ఎత్తు పల్లాలు, సుడిగుండాలను కూడా దాటుకుని నారా లోకేష్ చేసిన పాదయాత్ర సుదీర్ఘంగా రెండేళ్లపాటు సాగింది. ఎట్టకేలకు.. పాదయాత్ర మలిచిన తీరుతో ఆయన ప్రజలకు చేరువయ్యారు. మంత్రిగా మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నమూ చేస్తున్నారు.