రేవంత్- సత్యనాదెళ్ల కాంబో.. ఐటీ బూమ్‌కు మళ్లీ ఊపు?
నైపుణ్యాభివృద్ధి, భవిష్యత్ అవసరాలకు తగినట్లు మౌలిక సదుపాయాలను మెరుగుపర్చే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనికతను సత్య నాదెళ్ల ప్రశంసించారని సీఎంఓ ఓ ప్రెస్ నోట్ ఇచ్చింది. నైపుణాభివృద్ది, మెరుగైన మౌలిక వసతులే ఆర్థికాభివృద్ధికి దోహదపడి హైదరాబాద్‌ను ప్రపంచంలోని టాప్ 50 నగరాల్లో ఉంచగలవని సత్య నాదెళ్ల అభిప్రాయపడ్డారట. హైదరాబాద్‌లోని తొలి సాంకేతిక సంస్థల్లో మైక్రోసాఫ్ట్ ఒకటని, ప్రస్తుతం 10,000 మందికి ఉపాధి కల్పిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సత్య నాదెళ్లకు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో 600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్ లోనూ మైక్రోసాఫ్ట్ పెట్టుబడి పెట్టిందని, హైదరాబాద్‌తో పాటు తెలంగాణవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు పెంచుతూ పోతున్నందుకు సత్య నాదెళ్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్‌ను టెక్నాలజీ డొమైన్‌లో ప్రపంచంలోనే అగ్రగామి నగరంగా నిలిపివేందుకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిస్తున్న ఏఐ, జెన్ ఏఐ, క్లౌడ్‌తో సహా వివిధ సాంకేతిక అవసరాలకు అనుగుణమైన వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు మైక్రోసాఫ్ట్ మద్దతుగా నిలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సత్య నాదెళ్లకు విజ్ఞప్తి చేశారు.
అలాగే రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్లు, ఫ్యూచర్ సిటీ, కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ల అభివృద్ధి, రాష్ట్రంలో మౌలిక వసతులు కల్పనకు అమలు చేస్తున్న ప్రణాళికలు, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వంటి సంస్థల ద్వారా పరిశ్రమలకు అవసరమైన ప్రతిభావంతులను అందుబాటులో ఉంచేందుకు తాము చేస్తున్న కృషిని సత్య నాదెళ్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు.