కేసీఆర్ చేసిన పనికి ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకుంటున్న రేవంత్ ?
రేవంత్ రెడ్డి గద్దెనెక్కి ఏడాది పాలన తాజాగా పూర్తి చేసుకున్నారు. సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహాన్ని రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదగా ఆవిష్కరించనున్నారు.
విగ్రహావిష్కరణకు హాజరు కావాలంటూ విపక్ష నేత, మాజీ సీఎం కేసీఆర్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా కలిసి.. ఆహ్వానించారు. బీజేపీ సహా ఇతర పార్టీల నేతలకు, తెలంగాణ ఉద్యమకారులకు, ప్రజా సంఘాలు, కళాకారులు, గాయకులకు సైతం పేరు పేరునా ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటూ ఆహ్వానాలందాయి.
ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ విగ్రహంపై ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు అటు మీడియా, ఇటు సోషల్ మీడియా సాక్షిగా తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో గులాబీ బాస్ కేసీఆర్ ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సర్కార్.. తెలంగాణ తల్లి రూపు రేఖలు పూర్తిగా మార్చడం పట్ల కేసీఆర్ తనదైన శైలిలో స్పందించారు.
ఇది మూర్ఖత్వపు చర్యగా ఆయన అభివర్ణించారు. దీంతో కొత్తగా రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహం తనకు నచ్చలేదని కేసీఆర్ స్పష్టం చేసినట్లు అయింది. తాజాగా తన ఫేస్ బుక్ ఖాతా డీపీని సైతం కారు పార్టీ అధినేత కేసీఆర్ మార్చేశారు. తన సారథ్యంలో తెలంగాణ ఉద్యమం సమయంలో రూపొందించిన పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆయన డీపీగా పెట్టుకున్నారు. దీంతో రేవంత్ రెడ్డి సర్కార్ రూపొందించిన కొత్త విగ్రహం తనకు ఏ మాత్రం నచ్చలేదని కేసీఆర్ పరోక్షంగా స్పష్టం చేసినట్లు అయింది.
అంతేకాదు.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రావడానికి, తెలంగాణ ఉద్యమంలోకి ప్రజలు, యువత కీలక భాగస్వామ్యం కావడానికి తాను రూపొందించిన నాటి తెలంగాణ తల్లి విగ్రహం దోహదపడిందనే ఓ వాదన నేటికి బలంగా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరోసారి తాను రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడం ద్వారా తన బలాన్ని మరోసారి నిరూపించుకోనేందుకు కేసీఆర్ సమాయత్తమైనట్లు ఓ చర్చ అయితే పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతుంది.
తెలంగాణ తల్లి విగ్రహం మార్పుతోనే సీఎం రేవంత్ రెడ్డి తన గొయ్యి తానే తవ్వుకున్నారనే విధంగా ప్రజల్లోకి వెళ్లేందుకు గులాబీ బాస్ కేసీఆర్ సిద్ధమవుతున్నారట. ఈ క్రమంలోనే డీపీ మార్చి తన నిర్ణయాన్ని చెప్పకనే చెప్పేశారు. రేవంత్ రెడ్డి సర్కార్‌పై పోరాటాానికి ఈ తెలంగాణ తల్లి విగ్రహం మార్పుతో నాంది పలుకుతున్నట్లు కేసీఆర్ భావిస్తున్నారనే ఓ ప్రచారం అయితే బీఆర్ఎస్ శ్రేణుల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది.