మోదీ, అమిత్ షా లకు చుక్కలు చూపిస్తున్న షిండే?
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి రోజులు గడుస్తోన్నప్పటికీ ఇంకా ముఖ్యమంత్రి ఎవరనేది తేలట్లేదు. ముఖ్యమంత్రి పీఠంపై పీటముడి పడింది. భారతీయ జనతా పార్టీ అధిష్ఠానం నాన్చుడు ధోరణిని ప్రదర్శిస్తోంది. వరుసగా రెండోసారి ఏక్నాథ్ షిండేకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలంటూ శివసేన పట్టుబట్టడం దీనికి ప్రధాన కారణం.
సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 145 సీట్ల సంఖ్యా బలం బీజేపీకి లేదు. 149 సీట్లల్లో పోటీ చేసి 132 చోట్ల గెలిచిందీ పార్టీ. షిండే వర్గం శివసేన 81 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టగా 57 మంది గెలుపొందారు. అజిత్ వర్గానికి చెందిన ఎన్సీపీ మొత్తం 59 స్థానాల్లో పోటీ చేయగా 41 సీట్లు ఈ పార్టీ ఖాతాలో పడ్డాయి.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మిత్రపార్టీల మద్దతు తప్పనసరి కావడంతో ముఖ్యమంత్రి పదవి కోసం శివసేన భీష్మించింది. బీజేపీ అధిష్ఠానం మాత్రం ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ వైపే మొగ్గు చూపుతోంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ దఫా సీఎం పదవి తమ పార్టీకే దక్కాలనే పట్టుదలతో ఉంది బీజేపీ.
ఈ పరిస్థితుల మధ్య బీజేపీ అధిష్ఠానం సీఎం అభ్యర్థి ఖరారుపై ఈ ముగ్గురు నేతలు- ఏక్నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్లను ఢిల్లీకి పిలిపించుకుంది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వారితో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అంతా సవ్యంగా సాగుతోందనుకుంటోన్న ఈ దశలో ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే మరోసారి బీజేపీకి షాకిచ్చారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేయడానికి ఇంకాస్సేపట్లో జరగాల్సిన మహాయుటి కూటమి భేటీకి దూరం అయ్యారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా హుటాహుటిన సతారా జిల్లాలోని తన స్వగ్రామానికి బయలుదేరి వెళ్లారు. ఫలితంగా ఈ సమావేశం రద్దయింది.
ఇంకాస్సేపట్లో మహాయుటి భేటీ జరగాల్సి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నట్టుండి షిండే తన స్వగ్రామానికి ప్రయాణం కట్టడం పలు అనుమానాలకు తావిస్తోంది. దేవేంద్ర ఫడ్నవిస్‌ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసుకోవడానికి ఆయన ఎంత మాత్రం కూడా సుముఖంగా లేరనే విషయం దీనితో మరోమారు స్పష్టమైనట్టయింది.
ముఖ్యమంత్రి ఫడ్నవిస్ సారథ్యంలో ఏర్పడబోయే మహాయుటి సర్కార్‌లో ఉప ముఖ్యమంత్రి హోదాలో పని చేయడానికి షిండే ఇష్టపడట్లేదని, తామెవ్వరం కూడా అందుకు అంగీకరించట్లేదని శివసేన శాసన సభ్యుడు సంజయ్ శిర్సత్ తేల్చి చెప్పారు. సీఎంగా మినహా మరే పదవిని కోరుకోవట్లేదని స్పష్టం చేశారు.
.