కూటమి అధికారం లో ఉన్నా జగన్ విజయాలు ఆగడం లేదు గా?
ఏపీలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. విజయనగరం స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతోంది. జిల్లాలో ప్రస్తుతం స్థానిక సంస్థల్లో ఉన్న సంఖ్యా బలంతో వైసీపీ అధినేత జగన్ తమ అభ్యర్ధిని ఖరారు చేశారు.
కూటమిలో పోటీకి అభ్యర్ధుల విషయం లో తర్జన భర్జన జరుగుతోంది. విశాఖలో అనుసరించిన ఫార్ములానే ఇక్కడా అమలు చేసేందుకు సిద్దమైన వైసీపీ.. అక్కడ దక్కిన విజయమే ఇక్కడా ఖాయమనే ధీమాతో కనిపిస్తోంది.
విజయనగరం జిల్లా వైసీపీ నేతలతో మాజీ సీఎం జగన్ సమావేశమయ్యారు. పార్టీకి ఉన్న సంఖ్యా బలం.. కూటమి వ్యూహాల పైన జిల్లా నేతల నుంచి సమాచారం సేకరించారు. సీనియర్ నేత.. నాలుగు సార్లు బొబ్బిలి నుంచి గెలిచిన శంబంగి చిన అప్పలనాయుడు పేరును జగన్ ఖరారు చేసారు. జిల్లా నేతలు సమన్వయంతో.. సమిష్టిగా పని చేసి ఎమ్మెల్సీ సీటు గెలవాలని జగన్ సూచించారు. విశాఖలో ఏ విధంగా వ్యవహరించిందీ గుర్తు చేసారు.
విజయనగరం జిల్లా ఎమ్మెల్సీగా పని చేసిన ఇందుకూరి రఘరాజు పార్టీ ఫిరాయింపుతో అనర్హత వేటు పడింది. దీంతో ఎన్నిక అనివార్యంగా మారింది. ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. 11 వరకు నామినేషన్ల స్వీకరణ, 12న పరిశీలన ఉంటుంది. నవంబర్ 14 వరకు నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు అవకాశం కల్పించారు. నవంబర్ 28న ఉపఎన్నిక నిర్వహించనున్నారు.
జిల్లాలో వైసీపీకి 548, టీడీపీకి 168, ఇతరులు 16 మంది ఉన్నారు. మొత్తం 753 మందికి గాను 548 మంది సభ్యుల బలం వైసీపీకే ఉన్న తరుణంలో వైసీపీ ఈ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు పావులు కదుపుతోంది. అందులో భాగంగా జగన్ వ్యూహాత్మకంగా అప్పలనాయుడు ను ఎంపిక చేసారు.
అటు కూటమి నుంచి ఈ ఎన్నిక పైన జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మంత్రాంగం నడిపారు. చంద్రబాబు సూచనల మేరకు కూటమి అభ్యర్దిగా ఎవరిని నిలబెట్టాలనే అంశం పైన చర్చించారు. కూటమి అభ్యర్థిగా కిమిడి నాగార్జున, తెంటు లక్షునాయుడు, గొంప కృష్ణ వంటి నేతల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ, వీరేవరూ పోటీ చేసేందుకు ఇష్టపడడం లేదని తెలిసింది.
వైసీపీకి సంఖ్యా బలం ఉండటంతో.. విశాఖ తరహాలోనే కూటమి విజయనగరం లోనూ పోటీకి దూరంగా ఉండే అవకాశం ఉందని జిల్లాలో చర్చ జరుగుతోంది. అదే జరిగితే కూటమి పైన ఉత్తరాంధ్రలో జగన్ మరో విజయం సాధించినట్లే. ఈ ఎన్నిక పైన చంద్రబాబు తుది నిర్ణయం ఏంటనేది ఇప్పుడు కూటమిలో ఉత్కంఠగా మారుతోంది.