మోదీ డైరక్షన్ లోనే పవన్ ఇలా చేస్తున్నారా..?
పవన్ కల్యాణ్ సంపూర్ణ సనాతనిగా మారే విషయంలో తెర వెనుక ఏం జరిగిందన్న చర్చ ఇప్పడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతుంది. పవన్ కల్యాణ్ కేవలం.. ఏపీకి లేకపోతే తెలుగు రాష్ట్రాలపై తన ఫోకస్ పెట్టలేదు. తమిళనాడుపైనా ఉత్తరాధిపైనా ప్రభావం చూపేలా సనాతన ధర్మ డిక్లరేషన్ ప్రకటించారు. అందుకే పవన్ కల్యాణ్ కొత్త తరహా కాషాయ రాజకీయం జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశం అవుతుంది.
పవన్ కల్యాణ్ హఠాత్తుగా ఇలా పూర్తిగా కాషాయధారిగా మారిపోవడం వెనుక బీజేపీ సిద్ధాంత కర్తలు వ్యూహం ఉందన్న అనుమానాలను రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. హఠాత్తుగా పవన్ సనాతన ధర్మం గురించి ఉద్యమం ప్రారంభించడానికి వెనుక లోతైనా.. దీర్ఘకాలిక రాజకీయ వ్యూహం ఉంటుందని అనుకుంటున్నారు. పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టి మూడున్నర నెలలు మాత్రమే అవుతుంది. ఆయన ఇంకా తనదైన ముద్ర వేయలేదు. ఈలోపే సనాతన ధర్మ రక్షణ వైపు అడుగులు వేశారు.
తిరుపతిలో జరిగిన సభలో రాముడి విషయంలో రాహుల్ గాంధీ పైనా విమర్శలు గుప్పించారు. తమిళనాడులో బీజేపీ బలపడేలా డీఎంకే కొత్త నేత ఉదయనిధి చేసని వ్యాఖ్యల్ని ఖండించారు. అంటే ఆయన బాట చాలా క్లియర్ గా ఉంది. బీజేపీతో ఆయన బంధం మరింత గట్టిపడందని అనుకోవచ్చు అని విశ్లేషకులు అంటున్నారు. మొత్తంగా పవన్ సనాతన ధర్మ పోరాటం ఆషామాషీ కాదని.. చాలా దీర్ఘకాలిక ప్రయోజనాలు, ప్రణాళికలు ఉన్నాయని.. అంతా బీజేపీ కనుసన్నల్లో జరుగుతుందనే దిల్లీలో ప్రచారం జరుగుతోంది.
అయితే ఈ వారాహి బహిరంగ సభలో జనసేన అధినేత చేసిన కామెంట్లు బీజేపీకి అనుకూలంగా మారాయనే వాదన ఉంది. ఒక్క ఏపీలోనే కాకుండా.. తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణలో మరింత బలం చేకూరుతుందని జాతీయ మీడియా పేర్కొంది. అయితే పవన్ సొంతంగా పార్టీ పెట్టుకున్న నాయకుడు. అయినా బీజేపీతో ఆయన స్నేహం దాదాపు పదేళ్లుగా కొనసాగుతూనే ఉంది. 2014 నుంచి ఇప్పటి వరకు మధ్యలో కొద్ది పాటి విరామం మినహా.. బీజేపీతోనే పవన్ ఉన్నారు. దీంతో ఆయన్ను బీజేపీ నుంచి విడదీసి చూడలేమన్నది జాతీయ మీడియా చెబుతున్న మాట.