రేవంత్ ప్రభుత్వానికి దెబ్బ మీద దెబ్బ.. ఇప్పట్లో కోలుకోవడం కష్టమేనా?

తెలంగాణ రాష్ట్రంలో మరోసారి రాజకీయాలు చర్చకు దారి తీశాయి. ఎప్పుడూ లేని విధంగా ఈ సారి రాజకీయ పార్టీలు, సినీ ఇండస్ర్టీ మధ్య యుద్ధం కొనసాగుతోంది. దీనంతటికీ కారణం నిన్న మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలే. ఆమె చేసిన సంచలన వ్యాఖ్యలతో ఇప్పుడు సినీ ఇండస్ర్టీ నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.


నాగ చైతన్య, సమంత విడాకుల గురించి మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. కేటీఆర్ ను విమర్శించే క్రమంలో సురేఖ హీరోయిన్ సమంతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగ చైతన్య సమంత విడిపోవడానికి కేటీఆరే కారణం అంటూ మాట్లాడారు. హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేసి వారికి డ్రగ్స్ అలవాటు చేసి వాడుకున్నారని కేటీఆర్ పై విమర్శల వర్షం కురిపించారు.  అయితే ఇదే క్రమంలో సమంతపై చేసిన వ్యాఖ్యలు సినీ ప్రపంచాన్ని మొత్తం ఆలోచనలో పడేశాయి.


దాంతో ముందుగా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై అక్కినేని నాగార్జున స్పందించారు. మీ పార్టీల వ్యక్తిగత అంశాల్లోకి, రాజకీయాల్లోకి తమను లాగొద్దని కోరారు. అలాగే.. తనపై చేసిన విమర్శలకు సమంత కూడా రియాక్ట్ అయ్యారు. తన విడాకుల అంశంలో ఎలాంటి రాజకీయ కోణం లేదని ఇన్ స్టా వేదికగా చెప్పుకొచ్చారు. వ్యక్తిగత కారణాల వల్లే తాను విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని.. ఇద్దరం ఒప్పుకునే తాము విడాకులు పొందామని అన్నారు.


అనంతరం నాగ చైతన్య కూడా సురేఖ వ్యాఖ్యలపై స్పందించారు. అయితే ఆయన సొంతంగా ఏ మెసేజ్ చేయకపోయినా నాగార్జున చేసిన దానినే రీ ట్వీట్ చేశారు.  ఇక అమల కూడా ఘాటు గానే స్పందించారు. దీంతో పాటు టాలీవుడ్ ప్రముఖులు కూడా దీనిపై రియాక్ట్ అయ్యారు.

ఇక హైడ్రా రగడతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇమేజీ కాస్త డ్యామేజ్ అయింది. ముఖ్యంగా మూసీ నిర్వాసితుల నుంచి ఆ నిరసన మరింత ఎక్కువ అయింది. దాంతో గత మూడు రోజులుగా హైడ్రా చుట్టూనే తెలంగాణ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఇప్పుడు ఈ వివాదం కొనసాగుతుండగానే కొండా సురేఖ వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలో పడేశాయి. మరి వీటిని సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా తిప్పికొడతారో.. ఎలాంటి నష్ట నివారణ చర్యలు చేపడతారో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: