రాజకీయాలకు లడ్డూ భలే దొరికిందిగా?

మన దేశంలో రాజకీయ పార్టీలకు , మీడియాకు ప్రతి రోజూ ఏదో ఒక వివాదం కావాలి. ఒక ప్రకటనలో లడ్డూ కావాలా నాయనా అంటూ ఒక గొంతు వినిపిస్తుంది. అలాంటిది ఇప్పుడు రాజకీయ నేతలు, మీడియాకు లడ్డూ లాంటి వివాదం కాదు ఏకంగా లడ్డూనే వివాదంగా మారింది. అది కూడా సామాన్య లడ్డూ కాదు. ఏకంగా శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ప్రసాదం.


ప్రపంచ వ్యాప్తంగా హిందువులు ఎంతో భక్తితో కొలిచే దేవదేవుడు తిరుమల శ్రీవారి ప్రసాదాలను వైసీపీ హయాంలో కల్తీ నెయ్యితో చేశారని.. జంతువుల కొవ్వు వాడారని స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన ఆరోపణలు చేయడం తీవ్ర చర్చనీయాంశం అయింది. ఏపీ సీఎం వ్యాఖ్యలకు మద్దతుగా కొందరు, వ్యతిరేకంగా మరికొందరు స్పందిస్తున్నారు. జంతువుల కొవ్వుతో శ్రీవారి ప్రసాదాల తయారీన చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. తట్టుకోలేకపోతున్నారు కూడా.



లడ్డూ వివాదానికి మద్దతుగా జాతీయ స్థాయి నుంచి స్పందన లభిస్తోంది. దీనిపై సీనియర్ నేత టీటీడీకి ఈవోగా పనిచేసిన కృష్ణారావు మాట్లాడుతూ.. ప్రసాదాల్లో జంతువులు కొవ్వు కలిసే ప్రసక్తే లేదని.. ఏది ఏమైనా ఆరోపణలు వచ్చాయి కాబట్టి విచారణ జరపాల్సిందే అని అన్నారు. ఈ విషయమై తమిళనాడు ఎన్టీకే పార్టీ నేత సీమాన్ మాట్లాడుతూ. ప్రసాదాలు తిని ఎవరైనా చనిపోయారా అని ప్రశ్నించారు. దీనికి కౌంటర్ గా బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి సీమాన్ మానిసిక స్థితి సరిగా లేదని ఎద్దేవా చేశారు.


ఇక ఈ విషయమై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా దీనిపై చంద్రబాబుని వివరణ కోరారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ లడ్డూ ప్రసాదంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వీరితో పాటు తెలంగాణ, ఏపీ, దేశ వ్యాప్తంగా జాతీయ నేతలు తమదైన శైలిలో స్పందిస్దున్నారు.


నిజానికి చెప్పాలంటే చాలా మందికి తిరుమల ప్రసాదాల తయారీలో ఏం జరిగిందో తెలియదు. చంద్రబాబు ఆరోపణలు ఆధారంగా చేసుకొని ఎవరికి వారు స్పందిస్తున్నారు. మామూలుగానే ఏ చిన్న అవకాశం వచ్చినా రాజకీయ నేతలు వదిలిపెట్టరు. పైగా హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి.. అటు మీడియా, ఇటు రాజకీయ పార్టీలు మైలేజ్ పొందే ప్రయత్నం చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: