సీఎంగా రేవంత్ రెడ్డి ఔట్? కోమటిరెడ్డి మాటల వెనుక ఆంతర్యం ఏమిటి.!
పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సీఎంలను మార్చడం కాంగ్రెస్ పార్టీకి కొత్తేం కాదు. సీఎంలను మార్చడంలో ఆ పార్టీకి ఘనమైన రికార్డు ఉంది. మన పొరుగు రాష్ట్రం కర్ణాటకలోను రెండున్నరేళ్ల తర్వాత సీఎం సిద్దరామయ్యను తప్పించి ఆ ప్లేస్ లోకి డీకే శివకుమార్ వెళ్తారని ముందుగానే ఒప్పందం కుదిరింది.
ఇక తెలంగాణ విషయానికొస్తే ఎన్నో ప్రతికూలతలు, సీనియర్ల నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొని రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఎవరికి పదవి ఇవ్వాలనే విషయంపై అధిష్ఠానం అనేక బుజ్జగింపులు, సంప్రదింపులు తర్వాత రేవంత్ రెడ్డి పేరును ప్రకటించింది. అసలు రేవంత్ కి పీసీసీ చీఫ్ ఇవ్వడాన్నే పార్టీలోని కొందరు సీనియర్లు వ్యతిరేకించారు. మొత్తానికి అందరూ కాంప్రమైజ్ అయి సీఎంగా రేవంత్ ప్రతిపాదనను అంగీకరించారు.
అయితే భువనగిరి పార్లమెంట్ పరిధిలో తాజాగా నీటిపారుదల పనులపై సమావేశం జరిగింది. దీనికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిలు హాజరు అయ్యారు. ఈ సందర్భంగా కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డిని సీఎం గారూ అంటూ సంభోదించారు. అక్కడితో ఆగకుండా.. సీఎం పదవి గతంలో తప్పింపోయిందని.. కానీ భవిష్యత్తులో తప్పకుండా సీఎం అవుతారు అని అన్నారు. నేను చెప్పానంటే జరిగి తీరుతుందని కుండ బద్దలు కొట్టారు. ఎందుకంటే నా నాలుకపై మచ్చలు ఉన్నాయని.. అందుకే నేను చెప్పినవన్నీ జరుగుతాయని.. ఈ విషయం మా అమ్మ చెప్పిందని షాకింగ్ కామెంట్ చేశారు.
ఇప్పుడు ఈయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ క్రమంలో సీఎం గా రేవంత్ రెడ్డిని బాధ్యతల నుంచి తప్పించి ఆ పదవిని ఉత్తమ్ కి ఇస్తారా అనే చర్చ మొదలైంది. రేవంత్ ని కోమటి రెడ్డి సోదరులు ఆది నుంచి వ్యతిరేకిస్తున్నారు. అనేక సార్లు సీఎం పై వారు కామెంట్లు కూడా చేశారు. గతంలో ప్రచారం జరిగినట్లు రెండున్నరేళ్ల తర్వాత మరొకరని సీఎం చేస్తారా అనే చర్చ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.