చంద్రబాబు చేస్తున్న తప్పు అదేనా? ఇలా అయితే కష్టమే ?
ప్రభుత్వాన్ని నడపాలంటే అనుభవజ్ఞులైన సీఎం కావాలి. మంత్రుల కూడా ప్రతి విషయం మీద పూర్తిగా అవగాహన ఉండాలి. ఇదే సమయంలో పార్టీ కూడా లైన్ దాటకుండా వ్యవహరించాలి. గతానికి భిన్నంగా సీఎం చంద్రబాబు తన మంత్రి మండలిని ఏర్పాటు చేసుకున్నారు. పార్టీలో సీనియర్లను పక్కకు పెట్టి యువతకు పెద్ద పీట వేశారు. ఎవరూ ఊహించని వారికి తన క్యాబినెట్ లో చోటు కల్పించారు.
అయితే కూటమి ప్రభుత్వంలో మంత్రులు తప్పటడుగులు వేస్తున్నారనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి. ఈ విమర్శలకు ఇటీవల జరిగిన పరిణామాలే కారణం. ఏపీ క్యాబినెట్ లో పయ్యావుల కేశవ్, పార్థ సారథి, ఆనం రామ నారాయణ రెడ్డి లాంటి వాళ్లు మినహాయిస్తే అనుభవజ్ఞులు ఎవరూ లేరు. సుదీర్ఘకాలం పాటు ఎమ్మెల్యేలుగా, మంత్రులు చేసిన వారు కావడంతో వారు మాట్లాడే ప్రతి మాట ఆచితూచి మాట్లాడతారు. పార్టీకి ఇమేజ్ తెచ్చేలా వ్యవహరిస్తారు తప్ప.. బ్యాడ్ నేమ్ వచ్చేలా చేయరు.
కానీ కొందరి మంత్రుల వల్ల టీడీపీకి నెగిటివ్ టాక్ వస్తుందనే వాదన బలంగా వినిపిస్తోంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకున్న చంద్రబాబు పార్టీకి యువరక్తాన్ని ఎక్కించారు. వారికి పరిపాలన మీద అవగాహన లేకపోవడంతో తప్పులు దొర్లుతున్నాయి. దీంతో పార్టీకి ప్రజల్లో చెడ్డపేరు వస్తుందని సీనియర్లు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల జరిగిన పలు ఘటనలను వారు ఉదాహరణలుగా పేర్కొంటున్నారు.
మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు జరిగిన క్రమంలో హొం మంత్రిత్వ శాఖ, అలాగే అచ్యుతా పురం అగ్ని ప్రమాద విషయంలో కూడా కార్మిక శాఖ మంత్రి మాట్లాడిన తీరు పార్టీకి చెడ్డపేరు వచ్చేలా ఉందని పార్టీలో ప్రచారం నడుస్తోంది. అనుభవ రాహిత్యంతో చేసే కామెంట్ల వల్ల బాగా డ్యామేజ్ జరుగుతుందని వారు పేర్కొంటున్నారు. చంద్రబాబు ఈ వ్యవహారంపై ఫోకస్ చేయకపోతే పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి చంద్రబాబు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.