మందుపై బాబు మాస్టర్ ప్లాన్.. బాహుబలి రేంజ్‌లో ఉంటుందా?

frame మందుపై బాబు మాస్టర్ ప్లాన్.. బాహుబలి రేంజ్‌లో ఉంటుందా?

ఏపీలో మద్యం పాలసీ విషయంలో ప్రభుత్వం ఓ స్పష్టతకు వచ్చినట్లు కనిపిస్తోంది. వైసీపీ హయాంలో చేసిన మద్యం పాలసీకి మంగళం పాడి కొత్త పాలసీని తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన దాదాపు తెలంగాణ, ఏపీ ఒకే తరహా పాలసీని అవలంభించాయి. మద్యం షాపులకు టెండర్లు నిర్వహించి లాటరీ ద్వారా షాపులను కేటాయించేవారు. ఏడాదికి ఫీజులు వసూలు చేసేవారు.

వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్కారు ఆధ్వర్యంలో మద్యం షాపులు నడిచాయి . దీంతో కొంత వ్యతిరేకత వ్యక్తం అయింది. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం పాలసీల్లో నూతన విధానం తీసుకు వస్తామని చంద్రబాబు గతంలోనే ప్రకటించారు. అందుకు తగ్గట్లుగానే ఇప్పుడు కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. మద్యం దుకాణాల్లో తెలంగాణ మాదిరి గౌడ, ఈడిగ వర్గానికి రిజర్వేషన్లు కల్పించనున్నట్లు చంద్రబాబు కలెక్టర్ల సమావేశంలో తెలిపారు.

ఇక అక్టోబరు 1 నుంచి కొత్త మద్యం పాలసీని అమల్లోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇతర రాష్ట్రాల్లో లిక్కర్ పాలసీలు అధ్యయనం చేసి.. అందుకు అనుగుణంగా ఏపీలో పాలసీలు పెట్టాలని చూస్తున్నారు. ఇతరరాష్ట్రాల్లో పాలసీల అధ్యయనం కోసం నాలుగు టీలను సర్కారు ఏర్పాటు చేసింది.  ఈ బృందంలో ముగ్గురు చొప్పున అధికారులు ఉండనున్నారు.  తెలంగాణ, తమిళనాడు, కేరళ, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు నాలుగు బృందాలు వెళ్లి మద్యం విధానాన్ని పరిశీలించనున్నాయి.

మరోవైపు గౌడ, ఈడిగ వర్గాలు కుల వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు కాబట్టి వారికి మద్యం షాపుల్లో 15-20 శాతం వరకు రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే ఈ అధ్యయన బృందాలు ఆయా రాష్ట్రాలకు వెళ్లి మద్యం విక్రయాలు, లిక్కర్ షాపులు, బార్లలో మద్యం ధరలు, నాణ్యత, డిజిటల్ పేమెంట్ అంశాలపై నివేదిక తయారు చేస్తారు. దీని ఆధారంగా అక్టోబరు 1 నుంచి ఏపీలో నూతన మద్యం పాలసీ అమల్లోకి రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: