ఆ శాఖపై ఫుల్‌ ఫోకస్‌ పెట్టిన నారా లోకేష్‌?

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ విధానంపై ఫోకస్ చేసింది.  విద్యార్థులకు ట్యూషన్ ఫీజు అందేలా చేయడంలో ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఉన్నత విద్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కళాశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు విద్యా దీవెన, వసతి దీవెన స్థానంలో పాత ఫీజు రీయింబర్స్ మెంట్ విధానాన్ని అమలు చేసేందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించాలని మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు.

ఈ సందర్భంగా నారా లోకేశ్ మాట్లాడుతూ.. వసతి దీవెన, విద్యా దీవెన పథకాలకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం రూ.3480 కోట్లు బకాయిలు పెట్టిందన్నారు. బటన్లు నొక్కినా డబ్బులు వారికి జమ కాలేదు. బకాయిల కారణంగా విద్యార్థులు సర్టిఫికెట్లు ఆయా కాలేజీల్లో నిలిచిపోయినట్లు తెలిపారు. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైందన్నారు. ఏపీలో కళాశాలల్లో డ్రగ్స్ నిరోధించేందుకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ఇందుకోసం ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమించినా సరే అన్నారు. డ్రగ్స్ వల్ల కలిగే నష్టం, సమస్యలు, కేసులపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో గత అయిదేళ్లుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు తగ్గిపోవడంపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని అధికారులు సీరియస్ గా తీసుకోవాలని.. అడ్మిషన్ల పెంపుదలకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు.

ఉన్నత విద్యా సంస్థల వివరాలు, మౌలిక సదుపాయాలు, అడ్మిషన్లు, కోర్టు కేసుల వివరాలు డ్యాష్ బోర్డులో పొందుపరచాలని అన్నారు. ఇంజినీరింగ్ కళాశాలల్లో అడ్మిషన్లు, ఫీజులు ఏ మేరకు ఉండాలనే విషయంపై సమీక్షించారు. మరోవైపు 3220 లెక్చరర్ పోస్టుల భర్తీకి తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి లోకేశ్ ఈ సమావేశంలో చర్చించారు. న్యాయపరమైన చిక్కులు తొలగించి సాధ్యమైనంత త్వరగా పోస్టులు భర్తీ చేయాలన్నారు. పూర్తి పారదర్శకంగా, టాలెంట్ ఆధారంగా లెక్చరర్ పోస్టుల భర్తీ ప్రక్రియ ఉండాలని అధికారులకు మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: