వైసీపీ ఆఫీసు కూల్చివేత.. టీడీపీ చెబుతున్న కారణం ఇదే?

తాడేపల్లి సీతానగరంలోని వైసీపీ కార్యాలయాన్ని అధికారులు కూల్చివేయడం వివాదాస్పదం అవుతోంది. వైసీపీ ఆఫీసు కోసం నిర్మిస్తున్న భవనాన్ని టీడీపీ సర్కారు కూల్చి వేయించింది. అయితే.. ఆ స్థలం స్వాధీనానికి ఇరిగేషన్ శాఖ అంగీకారం లేదని టీడీపీ వాదిస్తోంది. సీఆర్డీఏ, ఎంటిఎంసి, రెవెన్యూ శాఖలు ఇరిగేషన్ భూమిని వైసీపీకి హ్యాండోవర్ చేయలేదని టీడీపీ నేతలు చెబుతున్నారు.

వైసిపి కార్యాలయం నిర్మాణానికి కనీసం ప్లాన్ కోసం దరఖాస్తు చేయలేదని.. ఇరిగేషన్ భూమిని కబ్జా చేసి, ఏ ఒక్క అనుమతి లేకుండా వైసిపి కార్యాలయ నిర్మాణం చేశారని టీడీపీ నేతలు అంటున్నారు. వైసీపీ కబ్జాలపై టిడిపి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు ఇప్పటికే ఫిర్యాదు చేశారట. కబ్జాలు, అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని సీఆర్డీఏ, ఎంటిఎంసీ కమిషనర్లకు ఆయన ఫిర్యాదు చేశారు. ఏంటీఎంసీ ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాల కూల్చివేసి వైసీపీ కబ్జా చేసిన ఇరిగేషన్ భూమి స్వాధీనం చేసుకోవాలని కోరారు.

టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు అధికార యంత్రాగం ఆగమేఘాలపై కదిలినట్టు కనిపిస్తోంది. అయితే.. ఈ ముప్పును ముందుగానే ఊహించిన వైసీపీ నాయకులు కూడా వెంటనే హైకోర్టును ఆశ్రయించినట్టు తెలిసింది. దీనిపై స్పందించిన హైకోర్టు.. నిబంధనల ప్రకారం ముందు వెళ్లాలని కోర్టు చెప్పినట్టు పత్రికల్లో వచ్చింది. మరి ఇప్పుడు వైసీపీ ఆఫీసు కూల్చివేత నిబంధనల ప్రకారమే జరిగిందా లేదా అన్నది తేలాల్సి ఉంది.

వైసీపీ హయాంలో ఈ భూ కేటాయింపు జరిపితే.. దానికి సంబంధించిన ప్రక్రియలో తగిన జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది. మరి అన్ని అనుమతులు తీసుకున్నారా.. లేక.. మనమే 30 ఏళ్లు అధికారంలో ఉంటామన్న గర్వంతో అనుమతుల విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారా అన్నది కూడా తేలాల్సి ఉంది. మొత్తానికి చంద్రబాబు సర్కారు కూడా జగన్ సర్కారుకు ఏమాత్రం తీసిపోకుండా ప్రతీకార చర్యలకు దిగుతోందన్నది మాత్రం స్పష్టం అవుతోంది. మరి దీన్ని జనం ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: