చంద్రబాబు కియా తెస్తే.. నారా లోకేశ్‌ టెస్లా తెస్తారా?

ఏపీలో కొత్త మంత్రి వర్గం కొలువుదీరింది. సీఎం చంద్రబాబు సహా 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ లు ఉండనున్నారు. ఈ మేరకు వారికి శాఖల కేటాయింపు కూడా జరిగిపోయింది. పవన్ కు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు కేటాయించగా. నారా లోకేశ్ కు ఐటీ, మానవ వనరుల అభివృద్ధి ఇచ్చారు.

అయితే యువ నాయకుడు నారా లోకేశ్ కు విద్యాశాఖతో పాటు ఐటీ ఇవ్వడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో లోకేశ్ ఐటీ మినిస్టర్ గా పనిచేశారు. ఆ సమయంలో ఐటీ సంస్థలను రాష్ట్రానికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు.  ఇప్పుడు కూడా ఆయనకు ఆ పదవి మరోసారి రావడంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది.

నారా లోకేశ్ స్టాన్‌ఫోర్డ్‌  యూనివర్శిటీలో చదవడం.. ఎన్నారైల్లో అనేక మందితో ఆయనకు పరిచయాలు ఉండటం అత్యంత సానుకూల అంశం. వీరితో పాటు మన రాష్ట్రానికి చెందిన పలువురు దిగ్గజాలు, పరిశ్రమల్లో బాగా రాణిస్తున్న వారు టీడీపీకి సానుకూలంగా ఉన్నారు. ఈ అంశాలన్నీ రాష్ట్రాభివృద్ధికి దోహదం చేస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈయనతో పాటు టీజీ వెంకటేశ్ కుమారుడు టీజీ భరత్ కు మంత్రి వర్గంలో పరిశ్రమల శాఖ దక్కింది.  వీరిద్దరూ యువకులే కావడం విశేషం. అంతే కాక ఇంగ్లీష్ లో మంచి కమాండ్ కూడా ఉంది.

ఇప్పుడు ఈ జోడికి ఒక అతిపెద్ద టాస్క్ ఉంది. అదేంటంటే.. టెస్లా, మెర్సడీస్ లు ఇండియాలో పెట్టుబడులు పెట్టేందుకు అనువైన రాష్ట్రాలు, ప్రదేశాలను వెతుకుతున్నాయి. ఈ కంపెనీ ప్రతినిధులను కన్విన్స్ చేసి అమరావతిలో కావొచ్చు.. లేదా అన్ని రకాల అనుకూలంగా ఉన్న విశాఖలో అయినా, రాయలసీమలో పెట్టుబడులు పెట్టించేలా ఒప్పిస్తే ఏపీ యువతకు న్యాయం చేసిన వారవుతారు. ఈ బడా కంపెనీలు వస్తే వీరిని అనుసరించి మరిన్ని కంపెనీలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. తద్వారా ఇక్కడి యువతకు ఉద్యోగావకాశాలు దక్కుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: