మద్యం కుంభకోణం.. జగన్‌ అడ్డంగా ఇరుక్కుంటారా?

ఎక్సైజ్ శాఖలో గతంలో ఉన్న పాలసీకి సంబంధించి జరిగిన అవకతవకల్లో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మేనేజింగ్ డైరెక్టర్ వాసుదేవరెడ్డి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఎన్నికల అనంతరం కీలక ఫైళ్లను తన సొంత ఇంటికి మార్చుకున్నారని వచ్చిన ఆరోపణలపై విచారించిన సీఐడీ అధికారులు హైదరాబాద్ లోని అతని నివాసంలో కొన్ని కీలక ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఉద్దేశ పూర్వకంగానే ఫైళ్లు తరలించారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

దీంతో పాటు అతని ఇంట్లో ఉన్న ల్యాప్ టాప్ కు సంబంధించి కీలక డిస్కులు స్వాధీనం చేసుకున్నారు. త్వరలోనే వాటికి సంబంధించిన డేటాను క్రోడీకరించి నివేదికను రూపొందించనున్నట్లు తెలిసింది.  ప్రస్తుతం తెలంగాణలో రూ.1000 ఉన్న మద్యాన్ని రూ.1600కి విక్రయించారని.. రూ.650 ఉన్న మద్యాన్ని రూ.1400కి అమ్మారని ఇటీవల వివరాలు బయట పెట్టారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి ఎపీ ప్రభుత్వంలో పనిచేస్తున్నారు. అంతకు ముందు రైల్వే ట్రాఫిక్ ఉద్యోగిగా ఉండేవారు. అక్కడి నుంచి ఏపీకి డిప్యూటేషన్ పై వచ్చారు. వచ్చిన దగ్గర నుంచి ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పాత బ్రాండ్లమే అందుబాటులో లేకుండా చేయడంతో పాటు వైసీపీ నేతల డిస్టిల్లరీ నుంచి వచ్చే మద్యమే అమ్మేలా చేశారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి.

అయితే ఎన్నికల ఫలితాల తర్వాత కీలక ఫైళ్లను ఎపీ ఎస్పబీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి దస్త్రాలు చోరీ చేసి తరలిస్తుండగా చూశానంటూ ఎన్టీఆర్ జిల్లాకు చెందిన శివకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించి పలు కీలక మైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలని కోరుతూ వాసుదేవరెడ్డి హైకోర్టుని ఆశ్రయించారు. మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరఫు లాయర్లు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారించిన ధర్మాసనం.. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అనంతరం కేసు విచారణను జూన్ 18కి వాయిదా వేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: