ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. కేసీఆర్‌ పై వేటు తప్పదా?

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించడంతో పాటు ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ ను అనర్హుడిగా ప్రకటించే అంశంపైనా శాసనసభ స్పీకర్ తగిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు కోరుతున్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు రాధాకిషన్ రావు పోలీసుల విచారణలో వెల్లడించడం గతంలో తాను చేసిన ఆరోపణలు ఇందుకు నిదర్శనమని భాజపా జాతీయ ప్రధానకార్యదర్శి బండి సంజయ్‌ అన్నారు. రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్ మెంట్ ను పరిశీలిస్తే ప్రతిపక్షాలపై ముఖ్యంగా భాజపాపై దాడి కోసమే ఫోన్ ట్యాపింగ్ ను ఉపయోగించుకున్నట్లు అర్ధమవుతోందని బండి సంజయ్‌ పేర్కొన్నారు.

సానుభూతిపరులతోపాటు పార్టీకి విరాళాలు ఇచ్చేవాళ్లను, మీడియా ప్రతినిధులను సైతం ఫోన్ ట్యాపింగ్ తో టార్గెట్ చేశారంటే కేసీఆర్ కు భాజపా అంటే ఎంతగా వణుకు పుడుతుందో తెలుస్తోందన్నారు బండి సంజయ్‌. లిక్కర్ కేసులో అడ్డంగా దొరికిన బిడ్డను కాపాడుకునేందుకే కేసీఆర్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశాన్ని స్రుష్టించినట్లు రాధాకిషన్ రావు స్టేట్ మెంట్ తో తేలిపోయిందని బండి సంజయ్‌ అన్నారు.

ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ పాత్ర ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు అమెరికాలోనే ఉన్నట్లు తెలిసినా ఎందుకు భారత్ కు రప్పించలేకపోతున్నారని బండి సంజయ్‌ అన్నారు. ప్రభాకర్ రావును అరెస్ట్ చేస్తే మరిన్ని వాస్తవాలు బయటకొచ్చే అవకాశముందని బండి సంజయ్‌ అన్నారు.

అయినా ఎందుకు ఆ పని చేయడం లేదన్నారు. తక్షణమే కేసీఆర్ ను అరెస్ట్ చేసి ప్రాసిక్యూషన్ చేయాలని బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి ప్రజాస్వామ్యంపై ఏ మాత్రం నమ్మకం ఉన్నా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుని తక్షణమే సీబీఐకి లేఖ రాయాలని బండి సంజయ్‌ కోరారు. మరి ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: