కేసీఆర్‌పైనే చురకలు.. తుమ్మల విసుర్లు భలే భలే?

చేనేత, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. మాజీ సీఎం కేసీఆర్‌పై విసుర్లు వేస్తున్నారు. గత ప్రభుత్వం చేనేత కార్మికులను పట్టించుకోలేదని...  కానీ, ప్రభుత్వం వచ్చిన తరువాత చేనేత కార్మికుల దీర్ఘకాలిక లబ్ధిచేకూరే పథకాల కోసం చర్యలు తీసుకుంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చురకలు వేస్తున్నారు. గత ప్రభుత్వం 2018 లో పవర్ లూమ్ కార్మికులకు ఇన్‌పుట్ సబ్సిడీ లింక్డ్ వేతనాల పరిహార పథకం ప్రవేశపెట్టిందన్న మంత్రి తుమ్మల.. ఈ పథకానికి క్యాబినెట్ ఆమోదం లేకపోవడం వల్ల నేటి వరకు నిధులు విడుదల కాలేదన్నారు.

ఈ ప్రభుత్వం వచ్చాక నేటి వరకు 33.23 కోట్ల రూపాయల నిధులు నేత కార్మికులకు 10 శాతం యార్న్ సబ్సిడీ రూపంలో టెస్కో నిధుల నుంచి విడుదల చేయడం జరిగిందని మంత్రి తుమ్మల  చెప్పారు. కొంత మంది మధ్యదళారులు పవర్ లూమ్ వస్త్రాను చేనేత వస్త్రాలుగా విక్రయించినట్లు తమ దృష్టికి రావడంతో విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించినట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు. గత ప్రభుత్వం చేనేత మిత్ర పథకాన్ని కేబినేట్ ఆమోదం లేకుండా హడావిడిగా ప్రవేశపెట్టడం ద్వారా ఆ పథకానికి కూడా నిధుల విడుదల కాలేదని, ఆర్భాట ప్రచారాల కోసం పథకాలు ప్రవేశపెట్టి చేనేత కార్మికులను మోసం చేసిందని మంత్రి తుమ్మల ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పద్దతి ప్రకారం అసలైన చేనేత కార్మికులకు లబ్ధి చేకురేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి తుమ్మల ప్రస్తావించారు. మరమత్తులు,  చేనేత మగ్గాల ఆధునీకరణకు కోసం 2024-25 సంవత్సరానికి బీసీ సంక్షేమ శాఖకు కేటాయించబడిన 400 కోట్ల రూపాయలు బడ్జెట్ వినియోగించుటకు ముఖ్యమంత్రి అంగీకరించినట్టు మంత్రి తుమ్మల తెలిపారు. వివిధ శాఖల ద్వారా 255 కోట్ల రూపాయల విలువైన ఆర్డర్లు టెస్కోకు వస్త్ర సరఫరా కోసం రావడం జరిగిందని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: