తెలంగాణలో దుస్థితి.. రేవంత్‌ రెడ్డి హ్యాండిల్‌ చేయలేకపోతున్నారా?

ప్రజల్లో మనపై అంచనాలు పెరిగిపోయిన తర్వాత వాటిని చేరుకోవాలంటే శక్తికి మించి కష్టపడాలి.  ఇందులో ఏ మాత్రం అలసత్వం వహించినా వారంతా నిరాశలోకి వెళ్లిపోతుంటారు. గతమే నయం అనే భావన వారిలో కలుగుతుంది. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ను గద్దె  దించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మార్పు రావాలి అంటే కాంగ్రెస్ రావాలి అనే నినాదాన్ని టీపీసీసీ చీఫ్ హోదాలో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి బలంగానే తీసుకెళ్లారు.  ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారు.

సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడిప్పుడే పాలనపై పట్టు సాధిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు ఇలా గడిచాయో లేదో.. సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అన్ని వ్యవస్థలను సీఎం ఇంకా గుప్పిటపట్టక ముందే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి.  కాంగ్రెస్ వస్తే కరెంట్ పోతది అని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసినా ప్రజలు వాటిని నమ్మలేదు.

కానీ కరెంట్ అధికారులు నిర్లక్ష్యం వల్ల అక్కడక్కడా కృత్రిమ విద్యుత్ కోతలు ప్రారంభం అయ్యాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇవన్నీ ప్రజలకు తెలియకపోయినా.. కరెంట్ కోతలకు కాంగ్రెస్సే కారణం అని భావిస్తారు. ఇంకా వర్షాభావ పరిస్థితుల వల్ల రాష్ట్రంలో కరవు ఛాయలు అలముకున్నాయి. అక్కడక్కడ నీటి ఎద్దడి తలెత్తింది. ఇది గత ప్రభుత్వ హయాంలో జరిగినా ఇప్పుడు వీటిని ప్రతిపక్షాలు భూతద్దంలో పెట్టి చూపించి రేవంత్ ను ఇరుకున పెట్టాలని చూస్తున్నాయి.

ఇక తాజాగా వానాకాలం సీజన్ ఆరంభమైంది. వర్షాలు పడుతున్న నేపథ్యంలో దుక్కులు దున్ని విత్తనాలు విత్తుకునేందుకు రైతులు సిద్ధం అవుతున్నారు. ఈ సమయంలో విత్తనాల కొరత అన్నదాతలకు ఆగ్రహం తెప్పిస్తోంది. గతంలో బీఆర్ఎస్ హయాంలో ఎరువులు, విత్తనాల కొరత ఉన్నా.. రైతన్నల ఆందోళనలు చాలా తక్కువ సందర్భాల్లో కనిపించింది. ఇప్పుడు కూడా గత ప్రభుత్వ తరహాలో ఎరువులు, విత్తనాలు సమకూర్చకపోతే రేవంత్ రెడ్డిపై వ్యతిరేకత ప్రారంభం అవుతుంది. దీనినే ప్రధాన అంశంగా తీసుకొని బీఆర్ఎస్, బీజేపీలు కాంగ్రెస్ ను డ్యామేజ్ చేయాలని చూస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: