పగిలిన "గాజు గ్లాస్" ముక్కలు.. గుచ్చుకునేదెవరికో?
గాజు గ్లాస్ ను ఈసీ ఫ్రీ సింబల్ జాబితాలో పెట్టడం తో అటు జనసేనతో పాటు ఇటు కూటమి పార్టీలకు ఎదురు దెబ్బగానే భావించాలి. ఒక విధంగా చెప్పాలంటే ఇది గెలుపు ఓటములను శాసిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. అయితే జనసేన కొంత వరకు సేఫ్ జోన్ లోకి వెళ్లింది. న్యాయ స్థానంలో ఆ పార్టీకి కొంత ఊరట లభించింది. పొత్తులో భాగంగా జనసేన 21 అసెంబ్లీ, రెండు ఎంపీ సీట్లలో పోటీ చేస్తోంది.
ఈ రెండు ఎంపీ సీట్ల పరిధిలో ఉండే అసెంబ్లీ స్థానాల పరిధిలో ఎవరికీ గాజు గ్లాస్ గుర్తు కేటాయించబోమంటూ ఈసీ న్యాయస్థానానికి వివరణ ఇచ్చింది. దీంతో జనసేనకు కాస్త పాక్షిక ఊరగింపు లభించింది. అయితే ఇది కూటమి గెలుపునకు ప్రమాదమే. దాదాపు 50 కిపైగా స్థానాల్లో ఇండిపెండెంట్లకు గాజు గ్లాసు గుర్తును కేటాయించిన నేపథ్యంలో..మరో 35 నియోజకవర్గాల్లో ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. ఇక్కడ సైతం గాజు గ్లాస్ గుర్తును కేటాయించొద్దని జనసేన కోరుతోంది.
ఈ లెక్కన చూసుకుంటే కూటమి ఓట్లు భారీగానే చీలే ప్రమాదం ఉంది. ప్రతి ఓటు కీలకంగా మారిన తరుణంలో గాజు గ్లాస్ గుర్తు చీల్చే ఓట్లు చేటు తెస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇప్పటి వరకు జనసేన పరంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇక కూటమి పరంగా న్యాయపోరాటం చేసే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే పొత్తులో భాగంగా అన్ని చోట్ల జనసేన పోటీ చేస్తున్నట్లే లెక్క. అందువల్ల దీనిపై టీడీపీ కూడా పిటిషన్ వేసింది. పగిలే కొద్ది పదునెక్కుతుంది అని పవన్ ఏ ఉద్దేశంతో అన్నారో గానీ.. ఇది నిజం అవుతుంది. కానీ ఎవరికీ గుచ్చు కుంటుందో అర్థం కావడం లేదు.