చంద్రబాబు జీవితంలో ఇదే అతి కీలకమైన పుట్టినరోజు?

ఎన్నికల్లో గెలిచి తీరాల్సిందే
ఓడితే రాజకీయ ఉనికికే ప్రమాదం
గెలవకపోతే టీడీపీ ఫినిష్‌
ఇవాళ చంద్రబాబు పుట్టినరోజు. ఆయన ఇప్పటి వరకూ ఎన్నో పుట్టిన రోజులు జరుపుకుని ఉండొచ్చు. కానీ ఇది మాత్రం చాలా ప్రత్యేకమైన పుట్టినరోజు. ఆయన చాలా క్లిష్టపరిస్థితుల్లో జరుపుకుంటున్న పుట్టిన రోజు. ఈ ఏడాది చంద్రబాబుకు తన రాజకీయ జీవితంలోనే అత్యంత కీలకమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. మరో నెల రోజుల్లో జరగబోయే ఎన్నికలు చంద్రబాబు రాజకీయ భవితవ్యాన్ని స్పష్టం చేస్తాయి. ఆయన ఒక్కడి భవితవ్యమే కాదు. ఈ ఎన్నికలతో అటు నారా లోకేశ్‌ భవితవ్యం, యావత్‌ తెలుగు దేశం పార్టీ భవితవ్యం కూడా ముడిపడిఉంది.

చంద్రబాబుుకు ఇవి చావో రేవో తేల్చుకోవాల్సిన ఎన్నికలు. గెలిచి తీరాల్సిన ఎన్నికలు.. గెలవక తప్పని ఎన్నికలు. అధికారం చంద్రబాబుకు, టీడీపీకి కొత్త కాదు. రాజకీయ సవాళ్లూ చంద్రబాబుకు, టీడీపీకి కొత్త కాదు. కానీ ఇప్పుడు ఎదురవుతున్న సవాలు మాత్రం.. ఆయన గతంలో ఎన్నడూ ఎదుర్కోలేనంత తీవ్రమైంది. ఈ ఎన్నికల్లో ఓడిపోతే.. చంద్రబాబు రాజకీయ ఉనికికే ప్రమాదం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబును చిత్తుగా ఓడించిన జగన్‌.. ఆ తర్వాత ఆయనకు చుక్కలు చూపించాడు. పార్టీని వెంటాడి వేటాడారు. రాజకీయంగానూ చంద్రబాబుతో ఆడుకున్నారు. నేను మోనార్క్‌ను నన్నెవరూ ఏమీ చేయలేరని భావించే చంద్రబాబును కటకటాల వెనక్కు పంపించి తన పగ ఏ రేంజ్‌లో ఉంటుందో జగన్ చెప్పకనే చెప్పారు. నాపై ఒక్క కేసూ లేదు అని చెప్పుకునే చంద్రబాబును కోర్టుల చుట్టూ తిప్పేలా జగన్ చేశాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. అనేక కేసులతో  చంద్రబాబును ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు.

ఈ పరిస్థితుల్లో చంద్రబాబు ఈ ఎన్నికల్లో జగన్‌కు అడ్డుకట్ట వేయలేకపోతే.. ఇక చంద్రబాబు రాజకీయంగా మనగలగడం కష్టం. మళ్లీ జగన్‌ అధికారంలోకి వస్తే.. టీడీపీని చీల్చి చెండాడటం ఖాయం. వయస్సు మీద పడుతున్న చంద్రబాబు.. మళ్లీ 2029 వరకూ పార్టీని బతికించుకోవడం అంత సులభం ఏమీ కాదు. ఇప్పుడు ఓడిపోతే.. భవిష్యత్‌ సీఎంగా టీడీపీ లోకేశ్‌ గురించి కంటున్న కల కలగానే మిగిలిపోతుంది. రాజకీయ జీవిత చరమాంకంలో చంద్రబాబు కేసులు, జైళ్లు, కోర్టులు అంటూ తీవ్ర మానసిక వేదన అనుభవించాల్సి వస్తుంది. అందుకే ఈ ఎన్నికలు చంద్రబాబుకు జీవన్మరణ సమస్య.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: