కేసీఆర్‌: ఆ ఒక్క నిర్ణయంతో పునర్‌వైభవం?

తెలంగాణ ఉద్యమం కోసం పుట్టిన పార్టీ టీఆర్ఎస్.. తెలంగాణ రాష్ట్ర సమితి. దీనిని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 2001లో ప్రారంభించారు. దాదాపు 22 ఏళ్ల పాటు  అదే పేరుతో కొనసాగింది. 14 ఏళ్లు ఉద్యమించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించింది. తర్వాత ప్రత్యేక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి పదేళ్లు పాలించింది. అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది.

రాష్ట్రాన్ని తలసరి ఆదాయంలో దేశంలో అగ్రగామిగా నిలిపింది. సాగునీరు అందుబాటులోకి వచ్చింది. విద్యుత్తు సమస్యను పరిష్కరించారు. రైతు బంధు, రైతు బీమా, దళితబంధు, బీసీ బంధు, వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇలా కీలక నిర్ణయాలతో తెలంగాణలో పదేళ్లు తిరుగులేని శక్తిగా ఉన్న పార్టీ టీఆర్ఎస్. అయితే కేసీఆర్ పదవీ కాంక్ష 22 ఏళ్ల పార్టీ ప్రస్థానాన్ని ప్రశ్నార్థకం చేసింది.

అత్యాశకు పోతే మొదటికే మోసం వస్తుంది అన్న చందంగా ప్రధాని కావాలన్న ఆశతో కేసీఆర్ కోరిక పార్టీ పేరు మార్పుకు కారణం అయింది. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చి సంచలన నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి టీఆర్ఎస్ అనేది ఒక ఎమోషన్. ఒక ఉద్యమం. కానీ దానిని కేసీఆర్ నామరూపాల్లేకుండా చేశారు. ఏపీ, మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పార్టీ కమిటీలను ఏర్పాటు చేశారు.

బీఆర్ఎస్ పేరుతోనే కేసీఆర్ ఎన్నికల బరిలో నిలిచారు. కానీ గులాబీ నేత తీసుకున్న నిర్ణయం తప్పు అన్నట్లుగా తెలంగాణ సమాజం ఎన్నికల్లో తీర్పు ఇచ్చింది. తెలంగాణలో తమకు తిరుగులేదు అనుకున్న కేసీఆర్ ను గద్దె దించారు. ప్రతిపక్షానికి పరిమితం చేసింది. దీంతో బీఆర్ఎస్ ను తిరిగి టీఆర్ఎస్ గా మార్చేందుకు ఆలోచన చేస్తున్నామని ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. పార్టీ పేరు మార్చడంతోనే ఎన్నికల్లో ఇబ్బందులు పడ్డామన్న విషయాన్ని గుర్తించాం. అందుకే పార్టీ పేరు మార్చాలని భావిస్తున్నాం. దీని వల్ల పార్టీకి పూర్వ వైభవం వస్తుందని ఆశిస్తున్నాం అని అన్నారు. పార్టీ మార్పుపై కేసీఆర్ పునరాలోచనలో పడినట్లు ఎర్రబెల్లి వ్యాఖ్యల ద్వారా స్పష్టమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: