షర్మిల: కక్ష తప్ప లక్ష్యం లేని బాణం

వైఎస్‌ షర్మిల.. ఇప్పుడు ఏపీలో బాగా వినిపిస్తున్న పేరు. ఐదేళ్ల క్రితం అన్నకు అండగా నిలబడ్డ చెల్లెలే ఇప్పుడు అన్నను టార్గెట్ చేస్తోంది. అన్న పార్టీ ఓటమే లక్ష్యంగా పని చేస్తోంది. అయితే ఆది నుంచి షర్మిల రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలిస్తే.. ఆమె ఓ లక్ష్యం లేని బాణంగా కనిపిస్తోంది. అసలు షర్మిల రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది.. ఏ దిశగా సాగుతోంది.. ఏ తీరాలకు చేరబోతోంది. ఇండియా హెరాల్డ్‌ ప్రత్యేక పరిశీలనాత్మక కథనం.

వైఎస్‌ షర్మిల.. ఏపీ సీఎం జగన్‌ చెల్లెలు, మాజీ సీఎం వైఎస్‌ ముద్దుల కుమార్తె. మొదట్లో అన్నకు అండగా నిలబడింది. అన్న పార్టీ పెట్టిన కొత్తలోనే కాంగ్రెస్‌ను ఎదిరించి ఈడీ కేసుల కారణంగా జైలుకు వెళ్తే.. నేను జగనన్న వదిలిన బాణాన్ని అంటూ పార్టీని తన భుజానమోసింది. వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి పార్టీని కాపాడింది. అయితే అన్న అధికారంలోకి వచ్చాక అంతఃపురంలో ఏం జరిగిందో కానీ.. అన్నతో విబేధాలు వచ్చాయి. అన్నతో దూరం పెరిగింది. వైసీపీకి ఎంత సేవ చేసినా తనకు కనీసం ఎంపీ సీటు కూడా ఇవ్వలేదన్న కోపమో.. ఆస్తుల పంచాయతీనో తెలియదు కానీ ఆ దూరం క్రమంగా పెరిగింది. అన్నపై కోపం ఉన్నా.. ఏమీ చేయలేని స్థితిలో భవిష్యత్‌ కార్యాచరణలో షర్మిల అనేక తప్పటడుగులు వేసింది.

అందులో మొదటిది తెలంగాణలో పార్టీ పెట్టడం. ఆంధ్రాకు చెందిన షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడం వ్యూహాత్మక తప్పిదం. అసలే తెలంగాణవాదమే లక్ష్యంగా రాష్ట్రం తెచ్చుకున్న ప్రాంతంలో పార్టీ పెట్టి అధికారం సంపాదించాలని ప్రయత్నించడం ఓ రాజకీయ దుస్సాహసం. అందుకే తెలంగాణలో పార్టీ పెట్టి వేల కిలోమీటర్ల పాదయాత్రలు చేసినా ఆమెకు ఇసుమంతైనా ప్రజాదరణ లభించలేదు. ఏనాటికైనా తెలంగాణకు ముఖ్యమంత్రిని అవుతానని ప్రగల్బాలు పలికిన షర్మిల అతి తక్కువ కాలంలోనే పార్టీని చాప చుట్టేసింది. కనీసం ఒక్క అసెంబ్లీ ఎన్నికల్లో అయినా పోటీ చేయకుండానే పలాయనం చిత్తగించింది. అసలు తెలంగాణలో పార్టీ ఎందుకు పెట్టిందో.. ఎందుకు ఎత్తేసిందో అర్థంకాని పరిస్థితి.
 
వాస్తవానికి షర్మిల కాంగ్రెస్‌లో చేరి తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని ఉవ్విళ్లూరింది. కానీ తెలంగాణలోని రేవంత్‌ రెడ్డి వంటి కాకలుతీరిన నేతలు ఆమె ఆశలకు ఆదిలోనే గండికొట్టేశారు. తెలంగాణ కాంగ్రెస్‌లో షర్మిలను చేర్చుకుంటే పార్టీకి చాలా నష్టమని రేవంత్‌ రెడ్డి హైకమాండ్‌ దగ్గర కుండబద్దలు కొట్టేశారు. ఆమె చేరికను ససేమిరా అంటూ అడ్డుకున్నారు. ఇక దిక్కుతోచని షర్మిలకు ఏపీలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్‌ పార్టీయే దిక్కయింది.
 
తెలంగాణ ఉద్దరణే లక్ష్యమంటూ పార్టీ పెట్టి ఆ తర్వాత జెండా పీకేసిన షర్మిల ఇప్పుడు ఏపీ కాంగ్రెస్‌ను ఉద్దరిస్తానంటోంది. పోటీకి అభ్యర్థులు కూడా దొరకని కాంగ్రెస్ పార్టీని బతికిస్తానని చెబుతోంది. ఏపీలో పూర్తిగా చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీకి పున‌‌ః ప్రాణ ప్రతిష్ట చేసేందుకు ఆమెకు ఇప్పుడు బాబాయి హత్యోదంతం ఓ ఆయుధంగా కనిపిస్తోంది. వివేకా హత్య జరిగి ఐదేళ్లవుతోంది. ఈ హత్య కేసుపై ఇన్నాళ్లూ మౌనం వహించిన వైఎస్‌ షర్మిల ఇప్పుడు ఏపీలో అన్న పార్టీని టార్గెట్‌ చేసేందుకు ఈ అంశంపైనే ఆధారపడుతోంది. మరి ఇన్నాళ్లుగా మౌనంగా ఉన్న ఆమె ఇప్పుడు రచ్చ చేస్తుంటే.. ప్రజలు ఎలా స్పందిస్తారో చూడాలి.

టీడీపీ, జనసేన, బీజేపీ అంతా చేతులు కలిపిన సమయంలో జగన్‌ ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు షర్మిల సైతం అన్నతో పోరాటం చేస్తూ మరింతగా ఇబ్బంది పెడుతున్నారు. ఏకంగా కడప ఎంపీ స్థానంలోనే బరిలో దిగి అన్న పార్టీతో అమీతుమీ తేల్చుకోవాలనుకుంటున్నారు. షర్మిల అధ్యక్షురాలుగా ఉన్నా ఏపీలో కాంగ్రెస్‌ ఏదో సాధిస్తుందన్న నమ్మకం ఎవరికీ లేదు. వైసీపీ, కూటమి అభ్యర్థుల హోరాహోరీ పోరులో కాంగ్రెస్‌ అభ్యర్థులు కనిపించేపరిస్థితి లేదు. మరి ఇంత చేసి షర్మిల సాధించేదేమిటి.. ఆమె రాజకీయ ప్రస్థానం లక్ష్యం లేని బాణంగా మారిందా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇటీవల ఆమెను ఓ విలేఖరి తెలంగాణలో పార్టీ పెట్టి మళ్లీ ఆంధ్రాకు వచ్చారేం అని అడిగితే.. తెలంగాణలో కేసీఆర్‌ను ఓడించాలనుకున్నాం.. ఓడించాం.. అక్కడ మాపనైపోయింది.. ఇక ఇప్పుడు ఏపీలో మా అవసరం వచ్చిందని ఆమే స్వయంగా అన్నారు. అంటే.. ఎవరినో ఒకరిని ఓడించడం తప్ప.. తాను గెలవడం అన్నది ఎప్పుడూ షర్మిల లక్ష్యం కాదంటున్న షర్మిల చివరకు సాధించేది ఏమిటన్నది.. కనీసం ఆమెకు కూడా అంతుబట్టకపోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: