గంగ చంద్రముఖిలా మారినట్టు.. తమిళనాడులా మారుతున్న ఆంధ్రా?

దేశ రాజకీయాలు వేరు. తమిళనాడు పాలిటిక్స్ వేరు. అక్కడ ప్రాంతీయ పార్టీలే తప్ప జాతీయ పార్టీలు అధికారంలోకి రావు. కేంద్రంలో ఉండే పార్టీ ఎంత పవర్ ఫుల్ గా ఉన్న తమిళనాట ఏదో ఒక ప్రాంతీయ పార్టీ పంచన చేరాల్సిందే. అయితే డీఎంకే.. లేకపోతే అన్నాడీఎంకే. అధికారంలో ఆ రెండు పార్టీలే ఉంటాయి. మిగతా పార్టీలు మిత్రపక్షంలోను.. ప్రతిపక్షంలోను ఉండాల్సిందే.

అయితే ఇదే పరిస్థితిని ఏపీలో ఉండేలా అటు చంద్రబాబు.. ఇటు జగన్ లు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. జాతీయ పార్టీల రాజకీయం ఏపీపై ఉండకూడదని ఇరు పార్టీల అధినేతలు కోరుకుంటున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. తమిళనాడు రాజకీయాలు ఇక్కడ కూడా ఉండాలని కోరుకుంటున్నారు. అయితే టీడీపీ లేకుంటే వైసీపీ. ప్రజలకు మరొక అవకాశం ఉండొద్దని ఇద్దరూ బలంగా భావిస్తున్నారు. అందుకు తగ్గట్లుగా చంద్రబాబు వ్యూహ రచన చేసి విజయవంతం అయ్యారు.

ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్న జనసేన పార్టీని తన దగ్గర పెట్టుకొని.. మరో పదేళ్లు ఆ పార్టీ అధికారంలోకి రాకుండా ఉండేలా చేసి. తద్వారా నారా లోకేశ్ కు చంద్రబాబు రూట్ క్లియర్ చేశారు. మరోవైపు దేశ వ్యాప్తంగా అత్యధికంగా సంక్షేమ పథకాలు అమలు చేసే రాష్ట్రాల జాబితాలో తమిళనాడు ముందు వరుసలో ఉంటుంది. జయలలిత హయాంలోనే స్కూటర్లు, ఫోన్లు, టీవీలు ఇస్తామనే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు వీటి డోసు ఇంకాస్త పెరిగింది.

దీనికి ఏపీ మినహాయింపు ఏమీ కాదు. 2014లో టీడీపీ డ్వాక్రా, రైతుల రుణమాఫీలతో పాటు ఇంకా మరికొన్ని హామీలు ప్రకటించింది. 2019లో వైసీపీ నవరత్నాల పేరుతో ఇంటింటికీ నగదు బదిలీ చేస్తోంది. ఇప్పుడు టీడీపీ వీటికి మించి సూపర్ సిక్స్ పథకాలను ప్రవేశపెట్టింది. ఇలా ఒకరిని మించి మరొకరు సంక్షేమ పథకాలను ప్రజలపై కుమ్మరిస్తున్నారు.  దీంతో పాటు బానిసత్వ రాజకీయాలు మొదలయ్యాయి. సీఎం జగన్ వెళ్తుంటే రోడ్లపై పడుకొని నమస్కారాలు చేయడం ఒక ఎత్తైతే.. చంద్రబాబు వస్తుంటే చొక్కా విప్పి మరీ మంటుడెండలో సాష్టాంగ నమస్కారం చేయడం మరో ఎత్తు. వీటిని చూస్తుంటే తమిళనాడు మాదిరి రాజకీయం ఏపీలో మొదలైంది ఏమో అనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: