చంద్రబాబు: కసి మీద వాలంటీర్లు.. టీడీపీ అంతు చూస్తారా?

ఏపీలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందించే వాలంటీర్లు ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నారు. వాలంటీర్లపై ప్రతిపక్షాల ఫిర్యాదులతో ఎన్నికల సంఘం జారీ చేసిన కీలక ఆదేశాలు వాలంటీర్ల ఉద్యోగాలపై ప్రభావం చూపాయి. ఏపీలో మొత్తం 2.67 లక్షల మంది వాలంటీర్లు పనిచేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ వాలంటీర్ల ద్వారానే సమర్థంగా అమలవుతున్నాయి. ముఖ్యంగా వృద్ధాప్య పింఛన్లు ప్రతి నెల ఒకటో తారీఖున అందించగలిగారు. ఇప్పుడు  ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో వారిని విధుల నుంచి దూరంగా ఉండాలని ఈసీ ఆదేశించింది.

దీంతో ఏపీలో మూకుమ్మడి రాజీనామాలు మొదలయ్యాయి. పెన్షన్ల పంపిణీతో వారికి సంబంధం లేదని చెప్పడం.. వారి వద్ద నుంచి ఫోన్లు, ఇతర డివైజ్ లు వెనక్కి తీసుకోవడంతో వాలంటీర్లు రాజీనామాల బాట పట్టారు.  ఎలాగూ రెండు నెలల పాటు ఎలాంటి పని ఉండదని తేలిపోయింది. దీంతో ఖాళీగా ఉండలేక.. వేరేది చేసుకోలేక మానసిక ఒత్తిడికి గురైన వారంతా రాజీనామాలు చేస్తున్నారు.

వైసీపీ అభ్యర్థుల పక్కన కనిపిస్తే చాలు వాలంటీర్లపై రాజకీయ ముద్ర వేస్తున్నారు. వారి ఫొటోల చుట్టూ వృత్తాలు గీసి మరి వారిని దొంగలుగా.. ద్రోహులుగా ఎల్లో మీడియా అభివర్ణించడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఏకంగా ఎన్నికల కమిషన్ కూడా వారిని విధులకు దూరం చేసింది. దీంతో వారంతా రాజీనామాలు చేస్తున్నారు. దాదాపు అన్ని చోట్ల వాలంటీర్లు స్వచ్ఛందంగా విధుల నుంచి తప్పుకుంటున్నట్లు ఎంపీడీవోలకు లేఖలు సమర్పిస్తున్నారు.

ఒకరకంగా చెప్పాలంటే వాలంటీర్లతో టీడీపీ కోరి మరీ కయ్యం తెచ్చుకున్నట్లయింది. వారి మానాన వారి పనిచేస్తూ ఇంటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు, సంక్షేమ పథకాలు అందిస్తుంటే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి మరీ వారిని రెచ్చగొట్టింది. అటు వాలంటీర్లకు పని లేకుండా చేసి, ఇటు లబ్ధిదారులను సచివాలయాల చుట్టూ తిరిగేలా చేసింది. ఇప్పటికే ఎల్లో మీడియా రాతలు, కూటమి నేతల తప్పుడు ఆరోపణలతో వాలంటీర్లు రగలిపోతున్నారు. రాజీనామాలు చేసిన వారంతా మరింత కసిగా టీడీపీ ఓటమి కోసం పనిచేస్తారు అని చెప్పడంలో సందేహం లేదు. ఇది టీడీపీని ఇరకాటంలో పెట్టేదే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: