ఏపీ: తట్టుకోగలమా.. ఈసీని తెగతిట్టుకుంటున్న అభ్యర్థులు?

ఎన్నికల అంటే ఆ హడావుడే వేరబ్బా. ప్రచారం, పాదయాత్ర, ర్యాలీలు, బహిరంగ సభలు అబ్బో ఒకటేంటి. నేతల హంగామా అంతా ఇంతా కాదు. ఎన్నికల ఏడాది ముందు నుంచే వ్యూహాలు, ప్రతివ్యూహాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతారు. ఈ గ్యాప్ లో క్షేత్రస్థాయిలో ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు ఫంక్షన్లకు, పెళ్లిళ్లకు వెళ్లి ఆర్థిక సాయాలు అందజేయడం వంటివి చేస్తుంటారు.

పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్ధుల జాబితాలో నా పేరు ఉంటే చాలు. ఎంత ఖర్చైనా ఫర్లేదు. ఒక్కసారి ఎమ్మెల్యే అయిపోవాలి. అని చాలామంది రాజకీయ నాయకులు, వ్యాపార వేత్తలు, ఎన్నారైలు భావిస్తుంటారు. కానీ ప్రస్తుతం ఈ ఎన్నికల ట్రెండ్ చూస్తే వేరే విధంగా ఉంది. బిజీబిజీగా ఉండాల్సిన నేతలు బిందాస్ గా గడుపుతున్నారు. అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించినా.. ఎక్కడా ప్రచార పర్వాలు ఇంకా ప్రారంభం కాలేదు. ఆయా పార్టీల అధినేతలు అక్కడక్కడా ప్రచార సభలు నిర్వహిస్తూ ఎన్నికల వేఢిని రాజేస్తున్నా.. క్షేత్రస్థాయిలో మిగతా చోట్ల ఆ ప్రచార జోరు కనిపించడం లేదు.

దీనికి కారణం లేకపోలేదు. ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం ఉంది. దీంతో అధికార, ప్రతిపక్ష నేతలు రెస్ట్ మూడ్ లోకి వెళ్లిపోతున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే అభ్యర్థులు కార్యకర్తలను చూస్తేనే హడలిపోతున్నారు. పది మంది కార్యకర్తలు వస్తే చాలు అమ్మో అంటూ భయపడిపోతున్నారు. ఎన్నికలకు ఇంకా 50 రోజులు ఉందంటూ కొంతమంది కార్యకర్తలకు అందుబాటులో లేకుండా తిరుగుతున్నారు.

ఇక పార్టీలు కూడా గతంలో ఎన్నడూ లేనంతంగా ఎన్నికల నోటిఫికేషన్ ముందే తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించేశారు. ఎన్నికలు అంటేనే భారీ ఖర్చు. ప్రాంతాలు బట్టి ఒక్కో నియోజకవర్గంలో రోజుకి కనీసం రూ.30-50 లక్షలు పట్టణ ప్రాంతాలు అయితే రూ.కోటి వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. దీంతో పాటు ప్రచారానికి వచ్చే కార్యకర్తలకు, నాయకులకు మందు, పసందైన విందు, మధ్యలో పార్టీ నాయకుల అలకలు.. వారిని బుజ్జగించేందుకు భారీ మొత్తంలో ముట్టజెప్పడం వంటికి చేయాలి. మొత్తం మీద అభ్యర్థుల పరిస్థితిని చూస్తున్న వారు  అయ్యో పాపం అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: