కేటీఆర్‌: ప్రజలకు ఆ లాజిక్‌ అర్థమైతే రేవంత్‌రెడ్డికి పరాభవమే?

పదేళ్ల పాటు తెలంగాణలో ఏకఛత్రాధిపత్యం ప్రదర్శించిన బీఆర్ఎస్ ఒక్క ఓటమితో కుదేలయింది.  తెలంగాణ ప్రభుత్వం ఎన్నో రోజులు ఉండదు. అబద్దపు పునాదులపై కాంగ్రెస్ సర్కారు ఏర్పడింది. మరి కొన్ని నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది అంటూ కేటీఆర్ అధికార హస్తం శాపనార్థాలు పెట్టారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ వంద రోజుల పాలన పూర్తి చేసుకుంది. ఇంతలో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది.

ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి చేరికలకు గేట్లు ఎత్తారు. దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో చేరికల జోరు పెరిగింది. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రభుత్వాన్ని కూల్చేస్తాం అనే వ్యాఖ్యలు రేవంత్ రెడ్డికి ఊతం ఇచ్చాయని చెప్పొచ్చు. ఎందుకంటే మా ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నాం అని చెప్పేందుకు సీఎం రేవంత్ కు అవకాశం ఏర్పడింది. వాస్తవానికి ప్రజాస్వామ్యంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని కూల్చుతామంటే ప్రజలు అంగీకరించరు. కానీ అదే చేసి చూపిస్తామని ఓ వైపు బీఆర్ఎస్, మరోవైపు బీజేపీ చెబుతూ వస్తోంది.

ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం రైతు రుణమాఫీ, ఆరు గ్యారంటీలు, ఫించన్లు డబుల్ చేస్తానని హామీ ఇచ్చింది. వీటిని వంద రోజుల్లో అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పదే పదే పలు సభల్లో ప్రస్తావించారు. కానీ నేటికి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం మినహా మరేదీ సక్రమంగా అమలు జరగడం లేదు. లోక్ సభ ఎన్నికలకు ముందు గృహ జ్యోతి, రూ.500కే సిలిండర్ గ్యారంటీలను అమలు చేశారు.

కానీ ప్రతిపక్ష నాయకులు వీటిపై మాట్లాడకుండా ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ మాట్లాడుతున్నారు. తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ సరైన పాయింట్ తీసుకున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎవరికి అయితే రూ.2లక్షల రుణమాఫీ అయిందో.. ఎవరి అకౌంట్లలో రూ.2500 నగదు బదిలీ అయిందో.. ఎవరికీ పింఛన్ రూ.4వేలు ఇచ్చారో.. పెరిగిన రైతుబంధు పడిన వారు.. వీరంతా కాంగ్రెస్ కు ఓటేయాలని పిలుపునిచ్చారు. మిగతా వారంతా తమ పార్టీకే ఓటేయాలని కోరారు. మరి ఇవి లోక్ సభ ఎన్నికల్లో ఏ మేర ప్రభావం చూపుతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: