రఘురామ ఆక్రోశం: బాబు ముంచేశారు.. పోటీ నుంచి తప్పుకుంటున్నా?

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు తాజాగా ఓ ఛానల్ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను నమ్ముకున్న చంద్రబాబు ముంచేశారనే అర్థం వచ్చేలా ఆయన మాట్లాడారు. సీఎం జగన్‌కు వ్యతిరేకంగా ప్రాణాలకు తెగించి తాను పోరాటం చేస్తున్నానని.. కానీ తనలాంటి వాటికి కూడా టికెట్‌ దక్కకపోతే ఎలా అంటూ ఆక్రోశం వ్యక్తం చేశారు. అసలు తనలా జగన్‌పై పోరాటం చేసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అంటూ సవాల్‌ విసిరారు. అలాంటి తనకు టికెట్‌ ఇవ్వట్లేదని ఎంపీ రఘురామ కృష్ణంరాజు చంద్రబాబుపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

టీడీపీలో ఉన్న ఏ ఒక్క నేత అయినా నాకంటే జగన్‌ను విమర్శించారా అంటూ చంద్రబాబును దాదాపు నిలదీశారు. ఈ మధ్య పార్టీలోకి వచ్చిన వాళ్లకు కూడా టికెట్లు ఇచ్చారు.. కానీ.. నాకు టికెట్‌ ఇవ్వడానికి మాత్రం ఆలోచిస్తున్నారని పరోక్షంగా చంద్రబాబు తనను ముంచేశారని చెప్పేశారు. రానున్న ఎన్నికలు జగన్‌మోహన్‌రెడ్డి కావాలా.. వద్దా.. అనే అంశం కోసమే జరగనున్నాయని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అంటున్నారు.

జగన్‌ మోహన్‌రెడ్డిపై మోపిన 11 ఛార్జిషీట్‌లలో 3,000కు పైగా వాయిదాలు కోరితే, సీబీఐ న్యాయస్థానం అనుమతించిందని ఎంపీ రఘురామ కృష్ణంరాజు చెప్పుకొచ్చారు. వేలసార్లు వాయిదాలు కోరిన వ్యక్తికి సంబంధించిన కేసుల విచారణ అతీగతీ లేకపోవడం దురదృష్టకరమని ఎంపీ రఘురామ కృష్ణంరాజు వాపోయారు. జగన్‌ కేసులపై ఏ ఒక్కరూ స్పందించకపోయినా తాను కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశానని.. జగన్‌ తనను లేపేసే ప్రయత్నం చేశారని..  వెంకటేశ్వరస్వామి దయ వల్ల బతికి బయటపడ్డానని ఎంపీ రఘురామ కృష్ణంరాజు చెప్పుకొచ్చారు.

జగన్‌ పాలన నుంచి విముక్తి కోసం ఎవరెంత కృషి చేశారో ప్రజలందరికీ తెలుసన్న ఎంపీ రఘురామ కృష్ణంరాజు.. 50 లక్షలమంది కార్యకర్తలున్న పార్టీలు కృషి చేయడం అభినందనీయమేనంటూనే.. నియంతను.. నువ్వెంత అని ప్రశ్నించి.. ప్రాణాలకు తెగించి ఒంటరి పోరాటం చేయడం ఎంత కష్టమో ప్రజలు ఆలోచించాలని సూచించారు. కూటమిలో బీజేపీకూడా కలవాలనే ఉద్దేశంతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ బాహాటంగా కృషి చేశారని.. తాను ఎవరికీ తెలియకుండా తాను ఎన్నో రోజులు దిల్లీలో గడిపానని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

rrr

సంబంధిత వార్తలు: