కేసీఆర్‌: గెలుపు కాదు.. ఉనికే అసలైన సవాల్‌?

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తో పదేళ్లు కలిసి ప్రయాణం చేసిన నేతలంతా ఇప్పుడు ఆయన్ను ఒంటరి చేసి వెళ్లిపోతున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పదవులు స్వీకరించిన వారు కూడా కేసీఆర్ పై కనికరం చూపడం లేదు. ఇలా బీఆర్ఎస్ లో గులాబీ బాస్ తర్వాత అంతటి ప్రాధాన్యం కలిగిన నేతగా కే.కేశవరావు ఉన్నారు.

కానీ లోక్ సభ ఎన్నికల ముంగిట ఆయన కూడా కేసీఆర్ కు షాక్ ఇచ్చారు. ఇది ఎవరూ ఊహించని పరిణామమే. ఆయన కాంగ్రెస్ లో చేరడం దాదాపు ఖాయమైంది. ఈ మేరకు ఆయన గ్రౌండ్ వర్క్ కూడా సిద్ధం చేసుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా కేకే ఇంటికి వెళ్లారు.  కాంగ్రెస్ లో చేరిక విషయమై చర్చించారు. శనివారం సాయంత్రం కేకే కుమార్తె, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి హస్తం గూటికి చేరారు.

అయితే కాంగ్రెస్ లో సుదీర్ఘకాలం పనిచేసిన ఆయన మాస్ లీడర్ కాదు. పక్కా క్లాస్ లీడర్. అందుకే ఆయన పార్టీ కార్యకలాపాల్లో, పదవుల్లో ఎక్కువగా ఉంటారు. ఆయన సేవలను గుర్తించిన కాంగ్రెస్ అధిష్ఠానం సీడబ్ల్యూసీలో సభ్యుడిగా తీసుకుంది. 2014లో తెలంగాణలో అప్పటి టీఆర్ఎస్ కు అనుకూల పవనాలు వీస్తున్నాయని గ్రహించిన ఆయన గులాబీ బాస్ కు చేరువై పార్టీలో చేరారు.

కేసీఆర్ కూడా ఆయన్ను గుర్తించి రెండు సార్లు రాజ్యసభకు పంపారు. పార్టీ జనరల్ సెక్రటరీ పదవీ కట్టబెట్టారు. పార్లమెంటరీ బాధ్యతలు ఇచ్చారు. ప్రతి విషయంలో ఆయన సలహాను స్వీకరించేవారు. అయితే బీఆర్ఎస్ అధికారం కోల్పోగానే ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. మరోవైపు కుమార్తె ఒత్తిడి తదితర కారణాలు.. ఇప్పట్లో బీఆర్ఎస్ కోలుకోలేదని భావించిన ఆయన కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధం అయ్యారు.  ఈ మేరకు సోనియా సమక్షంలో చర్చలు జరిపి తన రాజ్యసభ పదవిపై స్పష్టమైన హామీ తీసుకున్న తర్వాత ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: