టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్‌, బీజేపీ.. అభ్యర్థుల గుండెళ్లో రైళ్లు?

పార్టీల అధినాయకుల చల్లని చూపు కోసం పడిగాపులు కాశారు. పోటీకి పరితపించారు. టికెట్ కోసం హైరానా పడ్డారు. అభ్యర్థిత్వాన్ని దక్కించుకున్న నాయకులు, వారి అనుచరులు సంబరాల్లో మునిగి తేలారు. ఇంకొందరు టికెట్ల వేటలో ఉన్నారు. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ చూడగానే సంబురాల్లో మునిగి తేలుతున్న అభ్యర్థులు గుండె ఆగినంత పని అయింది. ఇన్ని రోజులా.. ఇంత ఖర్చు భరించాలా.. ఎన్నికల కమిషన్ ఎంత పని చేసింది అని అభ్యర్థులు టెన్షన్ పడుతున్నారు.

ఇంతకి విషయం ఏంటంటే.. గతేడాది 2019 ఏప్రిల్ 11న మొదటి విడత లోక్ సభ ఎన్నికలతో పాటే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.  ఈ సారి మాత్రం ఎన్నికల కమిషన్ వారం ఆలస్యంగా 2024 ఎన్నికల షెడ్యూల్ ని విడుదల చేసింది. ఈసారి ఏపీలో ఎన్నికలు నాలుగో విడత లోక్ సభ ఎన్నికలతో పాటు మే 13న జరగనున్నాయి. 2019తో పోల్చితే 57 రోజుల సుదీర్ఘ గడువు ఇచ్చింది. ఇదే అభ్యర్థులకు తీవ్ర భారమయ్యే పరిస్థితి ఏర్పడింది.

ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో అభ్యర్థులు ఖర్చు గురించి తలచుకుంటూ బెంబేలెత్తిపోతున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుత ఏపీలో పరిస్థితి గమనిస్తే అధికార వైసీపీ, విపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ చావోరేవో అన్నట్లు తలపడుతున్నాయి. ఒక్కో సీటుకు సుమారు రూ.60 కోట్లకు పైగా ఖర్చు చేయాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. 57రోజుల పాటు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, ప్రచార ఖర్చు, వాహనాల పెట్రోల్, డీజిల్ కు భారీగానే సమర్పించుకోవాల్సి ఉంటుంది.

ఎన్నికలంటే అభ్యర్థులకు ఆషామాషీ కాదు. టికెట్ దక్కించుకున్న అభ్యర్థులు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉండాలి. ఇందుకోసం నాయకులను మచ్చిక చేసుకోవాలి. కార్యకర్తలను పోషించాలి. ఇందుకోసం నియోజకవర్గాల్లో పర్యటించే కార్లు, బైకులు మొత్తానికి వీరే పెట్టుబడి పెట్టాలి. అసలే వేసవి.. మంచినీళ్లు, కూల్ డ్రింకులు, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం మళ్లీ ఇదే తరహా ఖర్చు అదనంగా మందు, విందు వినోదాలు, వెరసి ఖర్చు తక్కువలో తక్కువ రోజుకి రూ.కోటికి తక్కువ కాదని అంచనా వేసుకుంటున్నారు. సభలు, సమావేశాలకు జన సమీకరణ ఇవీ మరో ఎత్తు. ఇవన్నీ భరించకుంటే వెంట వచ్చే నాయకులు జారిపోతారే భయం మరోవైపు. ఈ సారి ఎన్నికలు మాత్రం ఓడిన అభ్యర్థికి అపార నష్టం కలిగిస్తుందనడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: