షర్మిళను రేవంత్‌ ముందుకు నడిపిస్తారా?

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ తిరిగి పుంజుకునేందుకు ఉండే అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఓ వైపు ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని దుమ్మెత్తి పోస్తున్న ఆ పార్టీ… తాజాగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీ కరణ చేయాలనుకున్న కేంద్ర ఆలోచనను వ్యతిరేకిస్తూ.. ఇటీవల విశాఖలో భారీ బహిరంగ సభ పెట్టింది. అంతేకాదు దీనికి ముఖ్య అతిథిగా తెలంగాణ సీఎం, ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డిని ఆహ్వానించింది.

ఈ సందర్భంగా సభకు విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డి అటు బీజేపీని టార్గెట్ చేస్తూనే మరోవైపు షర్మిళను కూడా ఆకాశానికెత్తారు. ఏపీ ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుక వైఎస్ షర్మిళ రెడ్డి అన్న సీఎం.. ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నారు. అంతేకాదు.. షర్మిళమ్మకి అండగా నేనుంటా.. ఏ అవసరం వచ్చినా ముందుంటా అన్నారు. షర్మిళమ్మ అధికారం కోసం ఇక్కడికి రాలేదు.. ఆంధ్ర ప్రజల పోరాటం కోసం ఇక్కడికి వచ్చింది అంటూ ఆమెకు కొండంత భరోసా ఇచ్చారు.

వైఎస్ ఆశయాలను పంచుకున్న వారే ఆయనకు అసలైన వారసులు అని అన్నారు. ఈ విధంగా చూస్తే షర్మిళనే వైఎస్ కు నిజమైన వారసురాలు అని అభిప్రాయపడ్డారు. షర్మిళకు ప్రజల బలం కావాలని అందుకోసం చట్టసభలో పాతిక మంది ఎమ్మెల్యేలు, ఐదు ఎంపీ సీట్లు ఇవ్వాలని.. మీ అందరి తరఫున షర్మిళ నిలబడతారని ప్రజలను కోరారు.

మరోవైపు అటు ప్రభుత్వంపై.. ఇటు కేంద్రంపై విమర్శలు గుప్పించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదని, రాజధాని ఎక్కడో అన్నది తెలియదు స్టీల్ ప్లాంట్ ని తెగ నమ్ముతున్నా అడిగే దిక్కే లేరని ఫైరయ్యారు. ఏపీలో జగన్, చంద్రబాబు విరోధులు అని దిల్లీకి వెళ్తే మాత్రం ఇద్దరూ మోదీ పక్కనే ఉంటారని ఎద్దేవా చేశారు. వైసీపీకి, టీడీపీకి ఓటేస్తే ఏపీలో ఉన్న పాతిక ఎంపీ సీట్లు మోదీ ఖాతాలోనే పడతాయని అన్నారు. గల్లీలో కొట్లాట.. దిల్లీలో దోస్తానా అంటూ టీడీపీ, వైసీపీలను విమర్శించారు. మొత్తంగా చెప్పాలంటే కాంగ్రెస్ నిర్వహించిన న్యాయ సాధన సభ సీఎం రేవంత్ రాకతో విజయవంతమైంది. కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: