కేసీఆర్‌కు మహారాష్ట్ర తలనొప్పి?

మన టైం బాగా లేనప్పుడు తాడే పామై కరుస్తుందంటారు. ప్రస్తుతం గులాబీ బాస్ కేసీఆర్ పరిస్థితి అలానే తయారైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన పరిస్థితి మరింత దిగజారింది.   ప్రస్తుతం బీఆర్ఎస్ కు సొంత రాష్ట్రంలోనే సమస్యలు వస్తున్నాయి.  సొంత పార్టీ ఎమ్మెల్యేలే అధిష్ఠానానికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు.

ఈ క్రమంలో గతంలో ఇతర దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతా.. థర్డ్ ఫ్రంట్ అంటూ బీరాలు పలికిన కేసీఆర్.. అందుకు అనుగుణంగా పలు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ ను విస్తరించారు. మహారాష్ట్ర, ఒడిశా, ఏపీ వంటి రాష్ట్రాల్లో ని పలువురి మాజీ నాయకులని చేర్చుకొని అక్కడ పార్టీ కార్యకలాపాలు నిర్వహించారు. మహారాష్ట్రలో అయితే ఓ మిషన్ లాగా చేరికల్ని ప్రోత్సహించారు. పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చి చేర్చుకున్నారన్న ప్రచారమూ జరిగింది.

అయితే ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. కేసీఆర్ ఓడిపోవడంతో వేరే రాష్ట్రాల వైపు చూసే సాహసం కూడా చేయడం లేదు. ఒడిశా నుంచి గిరిధర్ గమాంగ్ కుటుంబాన్ని ప్రత్యేక విమానంలో పిలిపించుకొని మరీ కండువా కప్పారు. ఏపీలో తోట చంద్రశేఖర్ జనసేనను వదిలేసి కేసీఆర్ వెంట నడిచారు. కనీసం ఆయన అందులో ఉన్న ఏదో ఒక స్థానంలో పోటీ చేసే అవకాశం లభించేది.

మహారాష్ట్రలో పలువురు మాజీ ఎమ్మెల్యేలను, మాజీ ఎంపీలను పార్టీలోకి చేర్చుకున్నారు. వారంతా ఇప్పుడు డైలమాలో పడిపోయారు. అసలు బీఆర్ఎస్ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తుందా లేదా అనే సందిగ్ధంలో పడిపోయారు. తమ పరిస్థితి ఏంటో అర్థం కాక పార్టీ నియమించిన ఆరుగురు కోఆర్డినేటర్లు సమావేశం అయ్యారు. అసలు బీఆర్ఎస్ పోటీ చేస్తుందో లేదో తేల్చాలని కేసీఆర్ కు లేఖాస్త్రం సంధించారు. వారంలో సమాధానం చెప్పాలని గడువు విధించారు. లేదంటే తమ దారి తాము చూసుకుంటామని అల్టిమేటం జారీ చేశారు.  ఒకప్పుడు తన మాటకు ఎవరూ ఎదురు చెప్పకూడదని భావించిన కేసీఆర్ కు ఇప్పుడు మహారాష్ట్ర నేతలు గడువు విధించడం తీవ్ర చర్చనీయాంశం అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: