ఈ ఎన్నికలు.. రేవంత్‌ రెడ్డికి అగ్నిపరీక్షే?

తెలంగాణ మాస్ లీడర్లలో రేవంత్ రెడ్డి ఒకరు. ఇంకా గట్టిగా చెప్పాలంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత రేవంత్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో ప్రభావం చూపే నేతల్లో తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డే ముందు వరుసలో ఉన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయాన్ని సాధించిన కాంగ్రెస్ ప్రస్తుతం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో ఉంది. ఇప్పటికే నాలుగు గ్యారంటీలను అమల్లోకి తెచ్చింది. మిగిలిన పథకాలను అమలు చేయడానికి కార్యచరణను సిద్ధం చేస్తోంది. ఇదిలా ఉండగా.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఫలితాలనే పునరావృతం చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది.

ప్రస్తుతం పార్లమెంట్ అభ్యర్థుల తుది జాబితాపై దృష్టి సారించింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి గురువారం దిల్లీ వెళ్లారు. అక్కడ కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీతో సమావేశం అయి అభ్యర్థులను ఫైనల్ చేయనున్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సంచలన విజయం సాధించింది కానీ.. భారీ విజయం సొంతం చేసుకోలేదు.  అత్తెసరు మార్కులతో అన్నట్లుగా మెజార్టీని సాధించగలిగింది. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లో 12-14 సీట్లు సాధిస్తే సీఎం రేవంత్ రెడ్డికి తిరుగుండదు. ఐదేళ్లు ఆయన ప్రభుత్వం ఢోకా లేకుండా పనిచేస్తుంది.

ఒకవేళ లోక్ సభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ కు ప్రతి కూల ఫలితాలు అంటే నాలుగు, ఐదు స్థానాలు గెలుచుకుంటే రేవంత్ కు తిప్పలు తప్పవు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సీఎం పదవి విషయంలోనే ఆయన పార్టీ సీనియర్ల నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొన్నారు. ఇప్పటికే పార్టీలో ఆయనకు ఒక వ్యతిరేక వర్గం ఉంది. ఒకవేళ నాలుగైదు ఎంపీ స్థానాలకు పరిమితం అయితే వారు అధిష్ఠానంపై తమ ఒత్తిడి తీసుకువస్తారు. పార్టీ నష్టపోతుంది అని లేఖలు రాస్తుంటారు. ఏది ఏమైనా పార్లమెంట్ ఎన్నికల తర్వాత సీఎం రేవంత్ భవితవ్యం తేలనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: