జగన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న బాబు అస్త్రాలు?

ఏపీలో వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటే వేయొద్దని, తన తండ్రి వైఎస్ వివేకానంద రెడ్డిని చంపింది వైఎస్ అవినాశ్ రెడ్డి, భాస్కర రెడ్డేనని వివేకా కుమార్తె సునీత చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ఇప్పటి వరకు ఆమె  తన తండ్రి హత్యపై న్యాయ పోరాటం చేస్తున్నారు. ఇకపై ప్రజా క్షేత్రంలో తేల్చుకోవాలని డిసైడ్ అయినట్లు కనిపిస్తున్నారు. తన తండ్రిని హత్య చేసిన నిందితులు, దోషులు, అనుమానితులు, పాత్ర ధారులు, తెర వెనుక సహాయం అందించిన వారు.. ఇలా అన్ని విషయాలను దిల్లీ వెళ్లి జాతీయ మీడియా సాక్షిగా చెప్పుకొచ్చారు.

జగన్ కు మరోసారి ఓటు వేయొద్దంటూ ఏపీ ప్రజలకు విజ్ఙప్తి చేశారు. ఓ రకంగా చెప్పాలంటే సునీత ఇలా బయటకి వచ్చి మాట్లాడటం వైసీపీకి షాక్ అనే చెప్పవచ్చు. గతంలో కూడా ఆమె ఆరోపణలు చేసినా.. ప్రస్తుతం ఎన్నికల సమయంలో ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేయడం అది వైసీపీ ఓటు బ్యాంకుపై ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  

ఎన్నికలు ఎప్పుడూ రెండు అంశాల మధ్య జరగుతూ ఉంటాయి. పాజిటివ్ టాక్ తో ముందుకు వెళ్లి 2014లో టీడీపీ లాభపడింది. బాబు వస్తే రాష్ట్రం బాగుపడుతుంది అనే అంశంతో  ఎన్నికలకు వెళ్లారు. 2019లో జగన్ వస్తే పేదలకు నవరత్నాలు అందుతాయి. రాజన్న రాజ్యం తెస్తాడు అనే నినాదంతో ఎన్నికలకు వెళ్లి విజయవంతం అయ్యారు.

ప్రస్తుతం పాజిటివ్ అంశాలు జనాల్లోకి వెళ్లడం లేదు. ఎందుకంటే ఏపీ ప్రజలు ఇద్దరి పరిపాలనను చూశారు. ఈ సమయంలో ఇప్పుడు నెగిటివ్ ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఇరు పార్టీలు వ్యూహ రచన చేస్తున్నాయి. సునీత ప్రెస్ మీట్ పెట్టడం లాంటి వాటి వల్ల జగన్ నేర చరిత కలిగిన వ్యక్తి, అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడు.. జగన్ హయాంలో రాష్ట్రం తిరోగమనంలో పయనించింది అంటూ సీఎం పై నెగిటివ్ ప్రచారం చేసి ఆయన కంటే నేనే నయం అనే అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా లబ్ధి పొందాలని చంద్రబాబు చూస్తున్నారు.  మరి వీటిని జగన్ ఏ విధంగా తిప్పికొడతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: