తెలంగాణకు మోడీ వరం.. ఆర్‌ఆర్‌ఆర్‌కు గ్రీన్‌సిగ్నల్‌?

కేంద్రం రీజనల్ రింగ్ రోడ్.. ఆర్ఆర్ఆర్ ద‌క్షిణ భాగానికి ప‌చ్చజెండా ఊపింది. రీజిన‌ల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్‌) భూ సేక‌ర‌ణ‌, విధాన‌ప‌ర‌మైన ప్రక్రియ‌ను వేగ‌వంతం చేసింది. ఆర్ఆర్ఆర్ లో యూటిలిటీస్ త‌ర‌లింపు భారం భ‌రిస్తామ‌ని కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్కరీ సీఎం రేవంత్ రెడ్డికి భరోసా ఇచ్చారు. నిన్న జాతీయ ర‌హ‌దారుల శాఖ మంత్రి నితిన్ గ‌డ్కరీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయిన సమయంలో ఆయన ఈ హామీ ఇచ్చారు.

హైద‌రాబాద్‌-విజ‌య‌వాడ ఆరు వ‌రుస‌లు, హైద‌రాబాద్‌-క‌ల్వకుర్తి నాలుగు వ‌రుస‌ల‌కు కూడా అనుమ‌తి ఇవ్వాలన్న రేవంత్ విజ్ఞప్తికి కూడా గడ్కరీ సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. దీంతో రీజిన‌ల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) ద‌క్షణ భాగం(చౌటుప్పల్‌- అమ‌న్‌గ‌ల్‌-షాద్‌ న‌గ‌ర్‌-సంగారెడ్డి- 182 కి.మీ) జాతీయ ర‌హ‌దారి ప్రక‌ట‌న‌కు సంబంధించిన ప్రధాన అడ్డంకులు తొల‌గిపోయినట్టయింది. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగాన్ని ఇప్పటికే కేంద్రం జాతీయ ర‌హ‌దారిగా ప్రక‌టించింది.
ఇక ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ ర‌హ‌దారుల శాఖ మంత్రి నితిన్ గ‌డ్కరీతో స‌మావేశ‌మైన త‌ర్వాత ఆర్ఆర్ఆర్ ద‌క్షణ‌ భాగాన్ని కూడా జాతీయ ర‌హ‌దారిగా ప్రక‌టించేందుకు ప్రతిపాద‌న‌లు కోరాల‌ని ఎన్‌హెచ్ఏఐ అధికారుల‌ను గడ్కరీ ఆదేశించారు. ఆర్ఆర్ఆర్‌తో పాటు తెలంగాణ‌లో జాతీయ ర‌హ‌దారుల విస్తర‌ణ‌కు అనుమ‌తి లభించింది. ప‌లు ముఖ్యమైన రాష్ట్ర ర‌హ‌దారుల‌ను జాతీయ ర‌హ‌దారులుగా అప్‌గ్రేడ్ చేయాల‌ని జాతీయ ర‌హ‌దారుల శాఖ మంత్రి నితిన్ గ‌డ్కరీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది.  

రాష్ట్రంలో జాతీయ ర‌హ‌దారులుగా విస్తరించాల్సిన రాష్ట్ర ర‌హ‌దారుల జాబితాను కేంద్ర మంత్రి గడ్కరీకి ముఖ్యమంత్రి అంద‌జేశారు. ఆయా ర‌హ‌దారులను జాతీయ ర‌హ‌దారులుగా ప్రక‌టించాల్సిన ప్రాముఖ్యతను రేవంత్ రెడ్డి గడ్కరీకి వివ‌రించారు. తొలుత రీజిన‌ల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్‌) నార్తర‌న్ పార్ట్ చౌటుప్పల్‌- భువ‌న‌గిరి- తుఫ్రాన్‌- సంగారెడ్డి -కంది ప‌రిధిలో యూటిలిటీస్ అంటే క‌రెంటు స్తంభాలు, భ‌వ‌నాల త‌దిత‌రాల తొల‌గింపున‌కు సంబంధించి వ్యయం విష‌యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మ‌ధ్య నెల‌కొన్న ప్రతిష్టంబ‌న‌పై చ‌ర్చించారు. చివరకు యుటిలిటీస్ త‌ర‌లింపు వ్యయాన్ని తామే భ‌రిస్తామ‌ని కేంద్ర మంత్రి రేవంత్ రెడ్డికి హామీ ఇచ్చారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: