ఏపీ బీజేపీ: మోదీ చరిష్మాయే దిక్కా?

ఏపీలో ఈ సారి పార్టీ బలం పెంచుకోవాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. దీనిపై బీజేపీ అగ్ర నాయకత్వం కూడా ప్రత్యేక దృష్టి సారించింది. 175 స్థానాల్లో ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. అదే సందర్భంలో 25 పార్లమెంట్ స్థానాల్లో కూడా అభ్యర్థుల లిస్ట్ ను ఖరారు చేసింది. ఇంకా అధిష్ఠానానికి పంపించి ఫైనల్ చేయడమే మిగిలింది.

ఇప్పటి వరకు పోరుబాట, పల్లెనిద్ర  వంటి కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లోకి వెళ్లింది. ఎప్పుడు అయితే చంద్రబాబు దిల్లీ వెళ్లి అమిత్ షాతో భేటీ అయ్యారో ఒక్కసారిగా క్యాడర్ లో అయోమయం నెలకొంది. పొత్తు ఉంటుందా.. ఉండదా.. ఉంటే తమకు కేటాయించే స్థానాలు ఎన్ని. అందులో తమకు సీటు వస్తుందా రాదా అనే సందేహాలు స్థానిక నాయకుల్లో సందేహాలు నెలకొన్నాయి. దీంతో పార్టీ కార్యక్రమాలపై దృష్టి సారించడం లేదు.

కాకపోతే ఈ అంశాలను పార్టీ అధిష్ఠానం చూసుకుంటుంది కాబట్టి ముందుగా స్థానిక నాయకులు ప్రజలను కలిసి ఈ రాష్ట్రానికి, దేశానికి బీజేపీ ఏం చేసింది. గత కాంగ్రెస్ పాలనకు, బీజేపీ ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసం చూపుతూ క్షేత్రస్థాయి ప్రాచారానికి వెళ్లాలని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు వికసిత్ సంకల్ప్ పేరిట తెలంగాణలో బీజేపీ పార్టీ కార్యక్రమాలు చురుగ్గానే చేపడుతున్నా ఏపీలో మాత్రం అంతంతమాత్రంగానే పార్టీ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

గతంలో ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేసే పార్టీలుగా కమ్యూనిస్టులు, బీజేపీ నాయకులకు గుర్తింపు ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితులు మారిపోయాయి. నాయకుల వెంట కార్యకర్తలు తిరగడం ప్రారంభించాక.. కార్యకర్తలకు ప్రజలతో సంబంధాలు తగ్గిపోయాయి. ప్రస్తుతం పొత్తు ఉంటే గెలుస్తారు అనే నమ్మకం ఉన్నప్పుడు పొత్తు లేకపోయినా గౌరవ ప్రదమైన ఓటు బ్యాంకు కలిగి ఉండేలా ప్రణాళికలు రచించాలని విశ్లేషకులు కాషాయ నేతలకు సూచిస్తున్నారు.  ఇంకెంత కాలం మోదీ చరిష్మా అడ్డు పెట్టుకొని ప్రచారం చేస్తారని ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: