పవన్‌కు జగన్ ఇబ్బందులు పెడుతున్నారా?

వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అన్ని పార్టీల నేతలు విస్త్రృత పర్యటన చేస్తున్నారు. ఈ సారి ఎన్నికలను మరింత సీరియస్ గా తీసుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ జిల్లాల పర్యటనకు హెలికాఫ్టర్ వాడదామని డిసైడ్ అయ్యారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను టచ్ చేసేలా విస్త్రృత పర్యటన చేసేందుకు హెలికాఫ్టర్ ని వినియోగించాలని ఆయన భావించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

అయితే ఎక్కడ పోగోట్టుకున్నాడో అక్కడే వెతుక్కోవాలనే ఉద్దేశంతో గతంలో పోటీ చేసి ఓడిపోయిన చోట భీమవరం నుంచే తన పర్యటనకు శ్రీకారం చుట్టారు. అయితే అనూహ్య పరిణామంతో జనసేనాని తన పర్యటనను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ముందుగా నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం పవన్ కల్యాణ్ ఈ నెల 14 నుంచి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లోపర్యటించాల్సి ఉంది. నాలుగు రోజులు పాటు ఆయన పర్యటన షెడ్యూల్ ని ఖరారు చేసింది పార్టీ అగ్ర నాయకత్వం.

భీమవరం నుంచి ఈ పర్యటన ప్రారంభం కావాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో పర్యటన వాయిదా పడటంతో పార్టీ శ్రేణులు నిరుత్సాహానికి గురయ్యారు. హెలికాఫ్టర్ ల్యాండింగ్ కు అధికారులు అనుమతులు ఇవ్వకపోవడంతో పర్యటన వాయిదా వేసుకుంటున్నట్లు జనసేన ప్రకటించింది. హెలికాఫ్టర్ ల్యాండింగ్ కు అనుమతి ఇవ్వకపోవడం వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ఆరోపించింది.

భీమవరంలోని విష్ణు కళాశాలలో ఉన్న హెలీప్యాడ్ ను భీమవరం పర్యటనకు వచ్చిన పలువురి ప్రముఖుల కోసం వినియోగించారు. కానీ పవన్ కల్యాణ్ పర్యటన విషయంలో అభ్యంతరాలు చూపడం ఆశ్చర్యంగా ఉందని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. ఇదే తరహాలో అమలాపురంలోను ఆర్ అండ్ బీ అధికారులతో అనుమతులు విషయంలో మెలిక పెడుతున్నారని నాయకులు మండిపడుతున్నారు. అధికార యంత్రాగాన్ని రాజకీయ కక్ష సాధింపులకు వాడుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. హెలికాఫ్టర్ కు అనుమతి ఇవ్వకపోతే రోడ్డు మార్గంలో రావొచ్చు కదా అని కొంతమంది కౌంటర్ వేస్తున్నారు. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి లబ్ధి పొందేందుకు యత్నిస్తున్నారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: