పవన్, లోకేశ్.. ఇలాగైతే గెలుపు కష్టమే?

ఏపీ రాజకీయాల్లో ఒక అంశం మిస్టరీగా మారింది. తెలుగుదేశం, జనసేన మధ్య పొత్తు ఖాయమైన సంగతి కొత్తేం కాదు. దాదాపు రెండేళ్లుగా పొత్తు దిశగా అడుగులు పడటం.. అందుకు తగిన కసరత్తులు జరగడం తెలిసిందే.  ఇప్పుడు తాజాగా ఈ రెండు పార్టీల మధ్యలో బీజేపీ వచ్చి చేరింది. ఆది నుంచి బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు శత విధాలా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. మరోవైపు తన ప్రియ మిత్రుడు పవన్ ద్వారా కూడా రాయభారం నడిపారు.

చివరకు అమిత్ షా చర్చలకు ఒప్పుకోవడం పొత్తుపై సానుకూలంగా ఉన్నారనే సంకేతాలు వస్తున్నా.. అటు టీడీపీలో కానీ ఇటు జనసేనలో కానీ ఆ జోష్ కనిపించడం లేదు. ఎందుకో అర్ధం కానీ ఆందోళన ఇరు పార్టీల్లో కనిపిస్తోంది. ఇప్పటకే సీట్ల వ్యవహారంపై ఇరు పార్టీల్లో అసమ్మతి నెలకొంది. మరోవైపు పొత్తుల గురించి ఎవరూ కూడా ఎక్కడా మాట్లాడటం లేదు. అంటే అమిత్ షా షరతులు విధించారా అనేది కూడా తేలడం లేదు.

ఇదిలా ఉండగా చంద్రబాబు అరెస్టైన సందర్భంలో పవన్ కల్యాణ్ రాజమండ్రి జైలుకు వెళ్లి పొత్తు ప్రకటన చేశారు. ఆ తర్వాత రెండు పార్టీలు కలిసే ఏదైనా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ఇంతవరకు బాగానే ఉన్నా పొత్తు ప్రకటన తర్వాత ఒక్కసారి మాత్రమే పవన్ వారాహి యాత్ర చేపట్టారు. ఇప్పుడు దాని ఊసే లేదు.  

నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ముగింపు సభకు హాజరైన పవన్ ఆ తర్వాత రెండు పార్టీల కార్యక్రమాల్లో కలిసి స్టేజీని పంచుకున్నట్లు ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు ఈ నెల 14 నుంచి ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన అధినేత పర్యటించనున్నారు. మరోవైపు లోకేశ్ శంఖారావం పేరుతో ఉత్తరాది నుంచి పర్యటన చేపట్టారు.  వాస్తవానికి ఇరు పార్టీలు కలిసి కార్యక్రమాలు చేపట్టాలి అని నిర్ణయించినా ఇప్పుడు ఎవరికి వారు ప్రత్యేకంగా యాత్రలు చేయడం చర్చనీయాంశం అయింది. మరి ఈ గందరగోళానికి చంద్రబాబు ఏమైనా పలుకుతారు ఏమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: