చంద్రబాబు చాణక్యుడు.. మళ్లీ రుజువైందిగా?

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఒకవైపు ఎన్డీయేతో భాగస్వామిగా ఉన్నపవన్ టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. టీడీపీతో పొత్తు కొనసాగుతూననే బీజేపీ తమతో కలసి వస్తోందని పవన్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు అందుకు తగ్గట్లుగానే దిల్లీ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నేరుగా బీజేపీ అగ్రనేతలతో సమావేశమైన చంద్రబాబు పొత్తులపై సంప్రదింపులు జరుపుతున్నారు.  అయితే చంద్రబాబు చొరవ తీసుకొని బీజేపీ పెద్దలను కలిశారా? లేక బీజేపీ అధిష్ఠానం పిలుపు మేరకు వెళ్లారా అనేది చర్చనీయాంశంగా మారింది.

2014 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేశాయి. 2018 వరకు టీడీపీ ఎన్డీయే కూటమిలో కొనసాగింది. తర్వాత విధానపరమైన అంశాలతో విభేదించిన చంద్రబాబు ఎన్డీయే నుంచి బయటకు వచ్చారు. 2019లో ఒంటరిగా పోటీ చేసి దారుణ ఓటమి పాలయ్యారు. వెంటనే పరిస్థితులను పసిగట్టిన చంద్రబాబు తిరగి ఎన్డీయే కూటమిలో చేరేందుకు చేయని ప్రయత్నం అంటూ ఏమీ లేదు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే తన చాణక్యాన్ని ప్రదర్శించారు.

తన పార్టీకి ఉన్న ఆరుగురు రాజ్యసభ ఎంపీల్లో నలుగురిని బీజేపీలోకి పంపారనే ప్రచారం అయితే నడుస్తోంది. వీళ్లలో చంద్రబాబు కి అత్యంత నమ్మదగిన సుజనా చౌదరి, సీఎం రమేశ్ లు పార్టీ మారడం ఎవరూ ఊహించలేదు. కానీ వీరంతా టీడీపీని ఒక్కమాట కూడా అనకుండా కాషాయ కండువా కప్పుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా టీడీపీని, ఆ పార్టీ అధినేతను విభేదించలేదు.

ఈ నలుగురితో పాటు బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా టీడీపీ పై సానుకూలంగా ఉండటం ఈ పొత్తు పొడుపుకు కారణం అని చెప్పవచ్చు. దీంతో పాటు పనవ్ కల్యాణ్ ను ముందుగానే చంద్రబాబు తన ఆధీనంలోకి తెచ్చుకోవడం.. జనసేనాని ద్వారా కూడా బీజేపీ పెద్దలతో మాట్లాడించడం వెరసి ప్రస్తుత పొత్తుకు కారణాలుగా చెప్పవచ్చు. మొత్తంగా చంద్రబాబు చాణక్యంతో తాను అనుకున్నది సాధించగలిగారు. పర్యావసానంగా టీడీపీ అధినేత రూట్లోకి బీజేపీ రాగలిగింది. చంద్రబాబు వ్యూహాలు  ఈ విధంగా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: