రేవంత్‌ రెడ్డి.. ఇంకా లేటు చేస్తే కష్టమే?

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 50 రోజులు కావొస్తోంది. ఎన్నికల ప్రచారం లో భాగంగా అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని ప్రకటించింది. అన్నట్లు గానే అధికారంలోకి రాగానే డిసెంబరు 9న రెండు గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టింది. మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించింది.

మరో పథకం చేయూతలో భాగంగా ఆరోగ్య శ్రీ బీమాను రూ. పది లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రతి రోజు వీటి గురించే చెప్పుకుంటుంది. ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో రెండింటిని అమలు చేశామని పదే పదే ప్రచారం చేసుకుంటుంది. ఇప్పుడు మిగతా హామీల అమలుపై దృష్టి సారించింది. అయితే పక్క రాష్ట్రం కర్ణాటక నమూనాగా గ్యారంటీల ను తెలంగాణ లో ప్రకటించి విజయవంతం అయిన కాంగ్రెస్ అమల్లో మాత్రం కొంతమేర ఇబ్బంది పడుతుంది.

ఆరు గ్యారంటీలు అమలు చేయాలంటే కేంద్రంలో కూడా కాంగ్రెస్సే రావాలనే  కొత్త పల్లవిని రెండు రాష్ట్రాల నాయకులు అందుకున్నారు.  ఇది పక్కన పెడితే తాజాగా బస్సుల పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మరో రెండు పథకాల అమలు దిశగా కసరత్తులు చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.  మహిళలకు రూ.2500 వారి ఖాతాల్లో జమ చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీంతో పాటు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్తు పథకాలపై సంబంధిత అధికారులతో సమాలోచనలు జరుపుతున్నారు.

అయితే మరోవైపు డ్వాక్రా మహిళలకు స్వయం సహాయక సంఘాలకు ఆధ్వర్యంలో మహిళలకు మండల, జిల్లా కేంద్రాల్లో ఉచిత కుట్టు శిక్షణ ఇప్పించి వారికి విద్యార్థుల, పోలీసుల ఏకరూప దుస్తులు(యూనిఫాం) ల కుట్టు పనులను అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇంత వరకు బాగానే ఉన్నా ప్రధాన హామీలైన స్కూటీలు, రూ. 500 కే గ్యాస్ సిలిండర్లు, తులం బంగారం వంటి పథకాలను త్వరగా అమలు చేయాలని లేకపోతే ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: